మంత్రి సబితాకు నిరసన సెగ: ఇంటిని ముట్టడించిన పేరంట్స్, కేంద్రమంత్రికి నారాయణ లేఖ
బాసలో త్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్ల కోసం వారు నిన్నటి నుంచి భోజనం చేయకుండా నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఆ నిరసన సెగ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా తాకింది. బాసర త్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంత్రి సబిత ఇంటికి భారీ ర్యాలీగా తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పురుగుల అన్నం..?
బాసర త్రిపుల్ ఐటీలో పురుగుల అన్నం తినడం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ హాస్టల్ మెస్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోలేదు. విద్యార్థులు ఆందోళనలను ఉధృతం చేశారు. వర్సిటీకి పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. వీసీ లేకపోవడం వల్ల వర్సిటీలో వసతులు సరిగాలేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

మెస్ కాంట్రాక్టర్ మార్చండి..
మెస్ కాంట్రాక్టర్ కూడా మార్చాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి ఆందోళనను ఉధృతం చేశారు. వర్సిటీ హాస్టల్ హాల్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పినా వినకుండా ఆందోళనను కొనసాగించారు. తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని వారి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు.

కేంద్రమంత్రికి లేఖ
ఈ విషయంపై సీపీఐ నారాయణ కూడా స్పందించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు సీపీఐ సీనియర్ నేత నారాయణ లేఖ రాశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులపై అధికారుల వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వర్సిటీకి రెగ్యులర్ వీసీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని, హాస్టల్ నిర్వహణ వర్సిటీ చేతుల్లో ఉండాలని కోరారు. విద్యార్థులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారని నారాయణ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications