కేసీఆర్ మళ్లీ దూరమే! అలా అవమానించింది మోడీనే అంటూ వినోద్ ఆగ్రహం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు హైదరాబాద్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గైర్హాజరు కానున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ కీలక నేత వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) రేపటి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో ప్రొటోకాల్‌ను పాటించకుండా అవమానించింది ప్రధాని మోడీనేనని ఆయన అన్నారు.

గతంలో కోవిడ్ సందర్భంగా మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు.. సీఎం వెళ్తానంటే వద్దన్నారని గుర్తు చేశారు వినోద్. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న ముఖ్యమంత్రిని ఆరోజు ఎందుకు వద్దన్నారో ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. ఈ క్రమంలోనే రేపటి కార్యక్రమాలకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారని చెప్పారు.
సూత్రప్రాయంగా అంగీకరించిన 14 జాతీయ రహదారులను మంజూరు చేయకుండా పెండింగ్‌లో ఎందుకు పెట్టారో రాష్ట్ర పర్యటన సందర్భంగా మోడీ స్పష్టత ఇవ్వాలని వినోద్ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. విభజన చట్టం ప్రకారం.. రైల్వే లైన్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని వినోద్ ఆరోపించారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేందుకు మతతత్వ బీజాలు నాటుతోందని మండిపడ్డారు.
ఇప్పుడు కుట్రలు, కుతంత్రాల బీజేపీ రాజ్యమేలుతోందని విమర్శించారు వినోద్ కుమార్. మరోవైపు, రేపు ప్రధాని మోడీ పర్యటన ఉన్న క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని, నిరసనలు తెలపాలని కేటీఆర్ శ్రేణులకు సూచించారు. అయితే, గతంలో రామగుండం పర్యటనలోనే ప్రధాని మోడీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని చెప్పారు. సింగరేణిలో రాష్ట్ర వాటే ఎక్కువగా ఉందని.. అలాంటప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటీకరిస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications