హవ్వా.. ఏందిది: మంత్రి భౌతికకాయం వద్ద.. నవ్వులా, కొడాలి నాని, వల్లభనేని వంశీపై అయ్యన్న ఫైర్
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారణం ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. హైదరాబాద్‌లో గల అతని నివాసంలో భౌతికదేహాం ఉంది. అక్కడ ప్రముఖులు వచ్చి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంజలి ఘటిస్తున్నారు. అయితే మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే నాని మాత్రం అక్కడ మాట్లాడుతూ కనిపించారు. అయితే వారిద్దరూ నవ్వుకోవడం మిగతావారికి కోపం తెప్పించింది. ఇదే విషయాన్ని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

సైకోలా..?
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ఉంచారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో స్పందించారు. తమ సహచర మంత్రి శవం ఉండగా మరో మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలి జోకులు వేసుకుంటున్నారని ఆరోపించారు. చిన్న వయస్సులో హఠాత్తుగా చనిపోయాడనే బాధ ఏ మాత్రం లేకుండా ఎలా నవ్వుకుంటూ ఉన్నారో చూడండి అని అందుకు సంబంధించిన వీడియోను కూడా అయ్యన్నపాత్రుడు షేర్ చేశారు. అంతేకాదు ఇలాంటి వారిని ఏమనాలి అని మండిపడ్డారు. సైకోలు అనాలా? ఇంకేమనాలి? అని ప్రశ్నించారు.
నానికి ఎదురుగా వంశీ..
ఆ వీడియో కొడాలి నాని.. ఎదురుగా వంశీ కనిపించారు. వారిద్దరూ ఏదో అంశంపై మాట్లాడుతూ ఉన్నారు. ఆ వీడియోను అయ్యన్నపాత్రుడు షేర్ చేశారు. ఇదేంటి అని మండిపడ్డారు. ఏ మాత్రం బాధ లేకుండా ఇలా నవ్వడం ఏంటీ అని తప్పుపట్టారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి.. ఇలా చేయడం భావ్యం కాదని చెప్పారు. మిగతా వారికి ఎలాంటి సంకేతాలను ఇస్తున్నారని ఫైరయ్యారు.

స్పందించని గౌతమ్
ఉదయం 7:45 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన స్పందించలేని స్థితిలో ఉన్నారట. ఆస్పత్రికి తీసుకొచ్చే సయమానికి గౌతమ్ రెడ్డి శ్వాస కూడా తీసుకోవడం లేదట. కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు కలిసి మంత్రికి 90 నిమిషాలకు పైగా సీపీఆర్ చేసిన ఫలితం లేకపోయింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం 9:16 గంటలకు చనిపోయారని అపోలో వైద్యులు ప్రకటించారు.

పుత్రశోకం..
మేకపాటి రాజ గోపాల్ రెడ్డి కుమారుడే గౌతమ్ రెడ్డి.. సౌమ్యులు, విద్యావేత్త, అందుకే కీలకమైన ఐటీ, పరిశ్రమల శాఖను సీఎం జగన్ అప్పగించారు. తనకు అప్పగించిన శాఖను సమర్ధవంతంగా ఆయన నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం.. పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరిపేవారు. ఎప్పుడూ బిజీగా ఉండేవారు. వాస్తవానికి ఇవాళ ఉదయమే ఆయన దుబాయ్ నుంచి వచ్చారు. రేపు సీఎం జగన్‌తో సమావేశమై.. చర్చించాల్సి ఉండగా మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ఆయన మృతితో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాయి. రోదనలతో మిన్నంటాయి.