భాగ్యనగరంలో గణేశ నిమజ్జనం ఏర్పాట్లపై రగడ; బండి సంజయ్ హెచ్చరికతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ!!
హైదరాబాద్ : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి గణేష్ నవరాత్రుల సందర్భంగా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను చేయడం లేదని బిజెపి తెలంగాణ సర్కారు తీరును తప్పు పడుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో సీఎం కేసీఆర్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇక వినాయక నిమజ్జనోత్సవానికి కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే, సీఎం కేసీఆర్ కు హిందువుల పండుగలు అంటే, అందులో ముఖ్యంగా వినాయక నవరాత్రులు అంటే శ్రద్ధ లేదని బీజేపీ విమర్శిస్తుంది.

నిమజ్జనానికి ఏర్పాట్లు చెయ్యలేదని ప్రభుత్వంపై ఆరోపణలు
శుక్రవారం జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్‌లో చిన్న, పెద్ద మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా చెరువులు నిర్మించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ బీజేపీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు.

ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లలో విఫలమైతే శోభాయాత్ర రూట్ మారుతుందన్న బండి సంజయ్
వినాయక నిమజ్జనోత్సవానికి అడ్డంకులు సృష్టించి, సరైన ఏర్పాట్లు చేయకపోతే, వారు విగ్రహాలను మండపాల నుండి తరలించరని తేల్చి చెబుతున్నారు.
ఇక పోలీసులు గురువారం కూడా నిమజ్జనం చేపట్టాలని నిర్వాహకులను కోరారు. శుక్రవారం అనంతచతుర్దశి అని, అందుకే ఆ రోజు మాత్రమే నిమజ్జనం చేయాలని చెబుతున్నారు మండపాల నిర్వాహకులు. తాజా పరిణామాలతో ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయడంలో విఫలమైతే గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర రూట్ మ్యాప్ మారుతుందని హెచ్చరించారు.

ప్రగతి భవన్ లో గణేశ నిమజ్జనం చేస్తామని వార్నింగ్
ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్‌కు చేరుకుంటామని, అక్కడే గణేశ విగ్రహాల నిమజ్జన చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. కులాలు, వర్గాల ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకే ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన ఆరోపించారు. కేవలం ఎంఐఎం నేతల మెప్పు పొందడం కోసం వినాయక నవరాత్రి ఉత్సవాలను, గణేష్ నిమజ్జనోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు బిజెపి నాయకులు.

నేడు నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించనున్న ఉత్సవ సమితి నాయకులు .. ఆపై తదుపరి నిర్ణయం
హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రాష్ట్రంలోని మొత్తం హిందూ సమాజాన్ని ఏకం చేయాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మరోవైపు నిమజ్జనం ఏర్పాట్లపై అధ్యయనం చేసి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు గణేష్ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు. మరి తాజా పరిణామాలతో వినాయక నిమజ్జనంపై అందరి దృష్టి నెలకొంది.












Click it and Unblock the Notifications