షాకింగ్: గ్రేటర్ ఓటరు సత్తా -పోలింగ్ శాతం పెరిగింది -20ఏళ్ల రికార్డు బ్రేక్ -చివరి గంటలో అనూహ్యం
అవి ఒకనాటి తిట్లు కావు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదైందంటూ చాలా మంది నిన్న చేసిన లొల్లి అంతా ఇంతా కాదు. సెలవురోజని తాపీగా తిని తొంగున్నారని.. సిటీ వాసులు బొత్తిగా బద్ధకిస్టులని.. ఐటీ ప్రొఫెషనల్సైతే ఓటింగంటేనే ఛీకొడుతున్నారని.. పట్టణవాసులెవరికీ ప్రజాస్వామ్యమంటే ప్రమ లేదని.. ఒరేయ్, మీకన్నా సరిహద్దులోని జమ్మూకాశ్మీరోళ్లు నయం, ఇబ్బందుల్లోనూ ఓట్లేస్తారని దెప్పి పొడుపు.. అసలు ఓటేయని వాళ్లకు ప్రభుత్వ పథకాలు కట్ చేయాలని సీపీ సజ్జనార్ పిలుపు.. ఒక్కమాటలో చెప్పాలంటే చేతిలో సెల్ ఫోన్ ఉన్నోళ్లలో గ్రేటర్ వాసుల్ని ఉతికారేశారు. కానీ సీన్ కట్ చేస్తే..
నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?

ఉద్రేకాలకు దూరంగా ఓటరు..
గ్రేటర్ ఎన్నికల చరిత్ర తెలిసిన ఎవరికైనా నిన్నటి పోలింగ్ సరళి పెద్దగా వింత అనిపించదు. కాకుంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారంతో హోరెత్తించడం, ప్రధాని మోదీ పరోక్షంగా, దేశంలో నంబర్-2 అమిత్ షా ప్రత్యక్షంగా, కేంద్ర మంత్రులు వరదలా రావడం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తమదైన శైలిలో విస్తృత ప్రచారం నిర్వహించడంతో గ్రేటర్ ఎన్నికలకు ఎనలేని ప్రచారం దక్కింది. మతపరమైన వ్యాఖ్యలతో భావోద్వేగాలు పొంగిపొర్లాయి.
కానీ నగర ఓటర్లు మాత్రం ఉద్రేకాలకు దూరంగా ఉన్నాడు. ఒక పార్టీని పని కట్టుకుని గెలిపించాలనో, మరో పార్టీని కచ్చితంగా ఓండిచాలనో అనుకోలేదు కాబట్టే, తమదైన శైలిలోనే వ్యవహరించారు. ఇక్కడ ఓటు హక్కు కలిగిన వలసదారులు పెద్ద సంఖ్యలో ఊళ్లకు వెళ్లిపోయినా, వరుస సెలవులు వచ్చినా, కరోనా భయాలు రెట్టింపైనా తడబడకుండా గ్రేటర్ ఓటర్లు సత్తా చాటుకున్నారు. గతంలో కంటే ఎక్కువగానే పోలింగ్ కేంద్రాలకు కదిలొచ్చారు..

పెరిగిన పోలింగ్ శాతం.. ఫైనల్ లెక్కలివి..
ప్రచారంలో చోటుచేసుకున్న అతి కారణంగా గ్రేటర్ పోలింగ్ తీరుపై అసంతృప్తులు వ్యక్తమయ్యాయినప్పటికీ, ఫైనల్ లెక్కల్లో మాత్రం గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది. గ్రేటర్ పోల్ తుది వివరాలను ఎన్నికల అధికారులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత విడుదల చేశారు. గడిచిన 18 ఏళ్లలోనే ఈసారి రికార్డు స్థాయిలో టర్నౌట్ నమోదుకావడం గమనార్హం. 2002 గ్రేటర్ ఎన్నికల్లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఇప్పుడు(2020లో) స్వల్పంగా పెరిగి 45.71 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

చివరి గంటలో సీన్ మారింది..
గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 50 శాతానికి మించి పోలింగ్ నమోదుకావడం తెలిసిందే. మంగళవారం నాటి పోలింగ్ లో సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ 30శాతానికి చేరుకోలేదు. ఓటింగ్ ముగిసే సమయానికి.. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం 37.50 శాతం పోలింగ్ నమోదైనట్లు వార్తలు వచ్చారు. కానీ, అన్ని బూత్ ల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత తుది ప్రకటనకు వచ్చేసరికి ఏకంగా 9 శాతం పోలింగ్ పెరగడం గమనార్హం. తద్వారా చివరి గంటలో జనం అనూహ్యంగా పోలింగ్ కేంద్రాలకు తరలినట్లు వెల్లడైంది.

3న రీపోలింగ్.. 4న ఫలితాలు
గ్రేటర్ లోని 150 డివిజన్లకుగానూ మంగళవారం 149 డివిజన్లలో ఓలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో సీపీఐ అభ్యర్థి గుర్తుకు బదులు సీపీఎం పార్టీ గుర్తును బ్యాలెట్‌లో ముద్రించడంతో ఆ వార్డులో పోలింగ్‌ను నిలిపివేశారు. ఇక్కడ ఈ నెల 3న రీపోలింగ్ జరుగనుంది. గత నెలరోజులుగా హోరాహోరీగా తలపడిన అభ్యర్థుల రాజకీయ భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు ఉండగా, ఆ రోజు సాయంత్రానికి ఫలితాలు వెల్లడవుతాయి. 4న వెలువడే ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.