అలా చేస్తే రెండేళ్ల జైలు, బయటివారు వెళ్లాల్సిందే: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. డిసెంబర్ 1న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) పార్థసారథి ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు.

బయటివారు హైదరాబాద్ విడిచివెళ్లాలి..
ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. అంతేగాక, డిసెంబర్ 1న సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధం విధించనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తంగా 74,67,256 మంది ఓటర్లు ఉండగా, వారిలో 38,89,637 మంది పురుషులు, 35,76,941 మంది మహిళా ఓటర్లున్నారు. 678 మంది ఇతర ఓటర్లున్నారని తెలిపారు. మొత్తంగా 9101 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో 1122 మంది అభ్యర్థులు వారి అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149 మంది, టీడీపీ 106, ఎంఐఎం 51, సీపీఐ 17, సీపీఎం నుంచి 12 మంది అభ్యర్థులతోపాటు 415 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం డివిజన్లలో మైలార్‌దేవ్‌పల్లిలో అత్యధిక ఓటర్లు ఉండగా, రామచంద్రాపురంలో అత్యల్ప సంఖ్యలో ఓటర్లున్నారు. అత్యధికంగా జంగమ్మెట్ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని పార్థసారథి తెలిపారు.

కరోనా పాజిటివ్ ఓటర్ల కోసం 5-6 గంటల వరకు
డిసెంబర్ 1న ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పూర్తవుతుందని తెలిపారు. కరోపా పాజిటివ్ ఓటర్లు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు.
కాగా, ఎన్నికల నియమావళి అమలుకు 19 మంది ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామన్నారు. ప్రజలు పార్టీ నేతలు ఎలాంటి ఫిర్యాదునైనా నోడల్ అధికారులకు చేయొచ్చన్నారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం నెంబర్ 040-29555500ను సంప్రదించాలని ఎస్ఈసీ పార్థసారథి సూచించారు.

మై జీహెచ్ఎంసీ యాప్ నుంచి ఓటర్ స్లిప్పులు..
గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను
చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘మై జీహెచ్ఎంసీ' యాప్ ద్వారా ఓటరు స్లిప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్‌లో ‘నో యువర్ ఓట్ ఆప్షన్'లో పేరు, వార్డు నెంబర్ నమోదు చేయడం ద్వారా ఓటర్లు స్లిప్, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని గూగుల్ మ్యాప్ చూపిస్తుందని తెలిపారు.

ఈ 18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటుంటే చాలు..
డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నయంగా మరో 18 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపినా ఓటు వేసేందుకు అనుమతిస్తామని లోకేష్ కుమార్ తెలిపారు. ఆధార్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, ప్యాన్ కార్డ్, ఎన్పీఆర్ స్మార్ట్ కార్డు, జాబ్ కార్డ్, హెల్త్ కార్డు, ఫొటో కూడిన పింఛను డాక్యుమెంట్, రేషన్ కార్డు, కులధృవీకరణ పత్రం, స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డు, అంగవైకల్యం ధృవపత్రం, పట్టాదారు పాసుపుస్తకం వీటిలో ఏదైనా ఒకటి వెంట తీసుకురావాలన్నారు.