Rajasingh: రాజాసింగ్ విజ్ఞప్తికి ఓకే చెప్పిన పోలీసులు.. ఇంటి వద్దకు తీసుకొచ్చి..!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టాకేలకు పోలీసులు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించారు. గతంలో ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో ఆయన పలుమార్లు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం మొరాయిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి, డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.

టైర్ ఊడిపోయింది
రాజా సింగ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా.. ధూల్‌పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. స్పీడ్ తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇప్పటికే చాలా సార్లు రాజా సింగ్ కు ఇచ్చిన ఈ వాహనం నడిరోడ్డుపై ఆగిపోయింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చి కొత్తది కేటాయించాలని రాజా సింగ్ పలుమార్లు ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు విన్నవించారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని రాజా సింగ్ వాపోయారు.

బుల్లెట్ బండి
ఆ తర్వాత అసెంబ్లీకి బుల్లెట్ బండిపై వచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లాడు. అయనా ప్రభుత్వం స్పందించకపోవడంతో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ వద్ద వదిలి పెట్టి వెళ్లారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చారు. 2017 మోడల్ ఫార్చ్యూనర్ కారును రాజసింగ్ ఇంటికి పంపించారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న రాజా సింగ్ ఈ విషయమై స్పందించారు.

వెహికిల్ ఏదైనా పరవాలేదు
ధూల్ పేటలోని తన ఇంటికి పోలీసులు దాన్ని తీసుకొచ్చి పార్కు చేసి వెళ్లారని చెప్పారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వెహికిల్ కండీషన్ ఎలా ఉందో చూసి చెబుతానని తెలిపారు. తనకు కొత్త కారు మాత్రమే ఇవ్వాలని ఏం లేదని, కండీషన్ లో ఉన్న వెహికిల్ ఏదైనా పరవాలేదని రాజా సింగ్ అన్నారు.

డీజీపీకి లేఖ
కాగా కొద్ది రోజుల క్రితం గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. తనకు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజా సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా చెప్పారు.

బెదిరింపు కాల్స్
"నన్ను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 3.34 గంటలకు బెదిరింపు కాల్ వచ్చింది. పాకిస్థానీ వాట్సాప్ కాల్ ద్వారా చంపుతామంటున్నారు. తమస్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయన్నారు. ప్రతి రోజు ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి' అని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీలను రాజా సింగ్ తన ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. దీంతో పోలీసులు రాజా సింగ్ కు మరో బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం కేటాయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications