నాయకులను కలిపిన వినాయకుడు.. ఖైరతాబాద్ కేంద్రంగా ఇంట్రస్టింగ్ సీన్..!!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా గణపతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఖైరతాబాద్ గణపతి వద్ద భక్తులు కోలాహలం నెలకొంది. పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తున్న మహా గణపతికి బుధవారం ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తొలిపూజ చేశారు. ఆమెకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలిపూజ
కాగా, గత కొంత కాలంగా గవర్నర్ తమిళిసై, ప్రభుత్వానికి మధ్య కొంత దూరం నెలకొన్న విషయం తెలిసిందే. తమిళిసై అధికారికంగా ఇటీవల పర్యటించిన సమయంలో ప్రొటోకాల్ పాటించలేదు అధికారులు. దీంతో ఆమె చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రజల కోసం పనిచేస్తున్నానని అన్నారు. అయితే, ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసైకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇతర నేతలు స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ కు శాలువా కప్పి తస్కరించారు దానం నాగేందర్. దీంతో ప్రొటోకాల్ గొడవ సద్దుమణిగినట్లేనా? అని చర్చ జరుగుతోంది.

ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.
Recommended Video

లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు
ఈఏడాది 50 అడుగులతో ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ వినాయకుడిని పూర్తిగా మట్టితోనే తీర్చిదిద్దారు. వినాయకుడితోపాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, త్రిశక్తిగా పిలుచుకునే మహా గాయత్రిదేవీ కొలువు దీరారు. ఖైరతాబాద్ మహా గ గణపతిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వినాయకుడిని దర్శించుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications