హైదరాబాద్ లో వర్షబీభత్సం: జూలోకి వరద.. లయన్ సఫారీపార్క్ మూసివేత; జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ!!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిధిలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్ మొదటి నుంచి జులై 12వ తేదీ వరకు సరాసరిన 68 శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. పలు మండలాలలో సాధారణం కంటే ఏకంగా 50 నుంచి 80 శాతం వరకు అత్యధిక వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వర్షాకాలం పూర్తయ్యేసరికి హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలతో నిండు కుండల్లా గ్రేటర్ హైదరాబాద్ లోని జలాశయాలు
గ్రేటర్ హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ తో సహా హుస్సేన్ సాగర్ నిండుకుండలను తలపిస్తున్నా యి. నగర పరిధిలోని అనేక చెరువులు, కుంటలు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఇక బుధవారం నాడు కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.ఎడతెరిప లేకుండా కురుస్తున్న భారీ వర్షాల మధ్య నెహ్రూ జూ పార్క్‌లోని సఫారీ పార్క్ జలమయమైంది.

వర్షాలతో భాగ్యనగర వాసుల జీవితం అస్తవ్యస్తం
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో చెట్లు విరిగిపడడం, రోడ్లు తీవ్రంగా దెబ్బ తినడం, అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా నగరంలోని రోడ్లు వరద నీటిలో మునిగి పోయాయి. కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం కలుగగా, మరికొన్ని ప్రాంతాలలో నాలాలు పొంగి పొర్లాయి. చాలా లోతట్టు కాలనీలలో వరదనీరు చేరి మోకాళ్ళ లోతు వరదనీరు నిలిచిపోయింది. దీంతో జనజీవనం స్తంభించింది.

నెహ్రూ జూపార్క్ సఫారీ పార్క్ మూసివేసిన అధికారులు
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, నెహ్రూ జూలాజికల్ పార్కుకు ఆనుకుని ఉన్నమీర్ ఆలం ట్యాంక్‌లోకి నీటి మట్టం పెరిగి జూలోకి వరదనీరు చేరింది. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం తర్వాత నెహ్రూ జూలాజికల్ పార్క్ పక్కనే ఉన్న ట్యాంక్‌లో నీటి మట్టాలు పెరిగి జూ గుండా వెళ్లే వాగు పొంగిపొర్లింది. దీంతో సఫారీ పార్క్ పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. జూలోని అధికారులు సఫారీ పార్క్‌ను వరదలు ముంచెత్తడంతో దానిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ జంతుప్రదర్శనశాలలో మిగిలిన భాగం ఉదయం 8.30 నుండి సాయంత్రం 4.30 వరకు యధావిధిగా సందర్శకులకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

వర్షాలతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ.. రంగంలో గ్రేటర్ సిబ్బంది
గత నాలుగు రోజుల్లో వర్షాల నేపథ్యంలో 995 ఫిర్యాదులు రాగా 982 ఫిర్యాదులను పరిష్కరించినట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఓ ప్రకటనలో తెలిపింది. జిహెచ్‌ఎంసి హెల్ప్‌లైన్ 040-21111111నంబర్ కు కాల్ చేసి, మై జిహెచ్‌ఎంసి యాప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను అధికారులకు తెలియజేస్తున్నారు.యుద్ధప్రాతిపదికన హైదరాబాద్ నగర వాసులు ఇబ్బందులను పరిష్కరించడం కోసం వరద ప్రభావిత ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పని చేస్తున్నారు.












Click it and Unblock the Notifications