తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్
హైదరాబాద్: భాగ్యనగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో కురిసన భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా, మరో మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్
ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని, హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగానే అప్పటికప్పుడు మేఘాలు ఏర్పడి కొద్ది గంటల వ్యవధిలోనే కుండపోత వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.

హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు
ఆది, సోమవారాల్లో హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇటీవల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో నిండుకుండల్లా ప్రాజెక్టులు
మరోవైపు, భారీగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. వరద నీరు పోటెత్తుతుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 62 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఫలితంగా అధికారులు 18 గేట్ల ద్వారా 61 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 75.14 టీఎంసీల సామర్థ్యంతో నీరు నిల్వ ఉంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500 క్యూసెక్కులు.. కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు.. వరద కాలువ ద్వారా 5,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1,087 అడుగులకు చేరింది.
ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. సాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరా నదికి వరద ప్రవాహం పెరిగింది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర శివారులోని మంజీరా నదిలో లో లెవల్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ-మహారాష్ట్రల మధ్య రాకపోకలు స్తంభించాయి. హైదరాబాద్ లోని జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలా మారిపోయాయి. దీంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.












Click it and Unblock the Notifications