ఒంటికి ‘బాంబు’ చుట్టుకుని బ్యాంకుకు.. డబ్బుల కోసం బెదిరింపు: ఆ తర్వాత ఏం జరిగిందంటే?
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ్ బ్యాంకులో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు. బ్యాంకులోకి చొరబడి తాను మానవ బాంబునంటూ అక్కడున్నవారిలో భయాందోళనలు కలిగించాడు. ఏకంగా తన ఒంటికి ఓ బాంబ్ సెటప్ పెట్టుకుని బ్యాంకుకు రావడం గమనార్హం. తనకు రూ. రెండు లక్షలు ఇవ్వకపోతే పేల్చేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో బ్యాంకులోని సిబ్బంది మొదట భయాందోళనలకు గురయ్యాడు.
అయితే, అతడు పెట్టుకొచ్చిన బాంబు ఉత్తుత్తిదేనని కాసేపటికి అక్కడున్నవారు గుర్తించారు. వెంటనే నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన బ్యాంకుకు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు బాంబుతో బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి విచారించగా అసలు విషయం బయటపడింది.

నిందితుడి వద్ద బాంబులాంటి పరికరాలు ఏవీ లేవని తేల్చిన పోలీసులు.. ఈజీ మనీ కోసం యూట్యూబ్‌లో చూసి చెరుకు గడలకు రెడ్ టేప్ చుట్టుకుని ఈ పని చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడ్ని శివాజీ(32)గా గుర్తించారు. అయితే, నిందితుడు చేసిన పని కాసేపు బ్యాంకులో భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించింది. నిందితుడికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
సోషల్ మీడియాను చాలా మంది మంచి పనుల కోసం వినియోగించుకుంటుంటే.. ఇలాంటి వ్యక్తులు కొందరు అనుచిత పనులు చేస్తూ శిక్షలు అనుభవిస్తున్నారు. కాగా, రాజా ది గ్రేట్ సినిమాలో రాజేంద్రప్రసాద్ అండ్ గ్యాంగ్.. బొమ్మ తుపాకీలతో వచ్చి ఓ బ్యాంకును దోచుకునేందుకు ప్రయత్నించిన సీన్‌ను ఈ ఘటన గుర్తు చేసింది. నిందితుడు అసలు మతివుండే ఈ పని చేశాడా? అని అక్కడివారు అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications