Hyderabad: పంజాగుట్ట, అమీర్‌పేట్ మార్కెట్లు మూసివేత, ఎందుకంటే?
హైదరాబాద్: నగరంలో రెండు కీలక మార్కెట్లు మూతపడనున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట, అమీర్‌పేట్‌లోని మున్సిపల్ మార్కెట్లను గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ (GHMC) మూసివేయనుంది. ఎందుకంటే, ఈ రెండు మార్కెట్లలోని భవనాలు, దుకాణాల సముదాయాలు శిథిలావస్థకు చేరడమే కారణం.
ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.
అమీర్‌పేటలోని మున్సిపల్ మార్కెట్ 1175 చదరపు గజాల్లో ఉంటుంది. ఇక్కడ 82 దుకాణాలు, రెండు కార్యాలయ గదులు ఉన్నాయి. పంజాగుట్ట మున్సిపల్ మార్కెట్ 800 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ 45 దుకాణాలు, రెండు కార్యాలయ గదులు ఉన్నాయి. అయితే, దుకాణాలు, కార్యాలయ గదులన్నీ శిథిలావస్థకు చేరుకోవడంతో వీటిని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

అంతేగాక, అమీర్‌పేట, పంజాగుట్ట మున్సిపల్ మార్కెట్ల స్థానంలో కొత్త దుకాణాలు, కార్యాలయ గదులు నిర్మించేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అమీర్‌పేట మున్సిపల్ మార్కెట్‌ను కూల్చివేసి దాని స్థానంలో రూ. 8.66 కోట్లతో గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు నాలుగు అదనపు అంతస్తులు, సెల్లార్ ఫ్లోర్‌ను నిర్మించనుంది.
ఇక పంజాగుట్ట మున్సిపల్ మార్కెట్ ప్రాంతంలోనూ రూ. 5.36 కోట్ల వ్యయంతో గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు నాలుగు అదనపు అంతస్తులు, సెల్లార్ ఫ్లోర్ నిర్మాణం చేయనుంది. ఈ రెండు మార్కెట్లలోని సెల్లార్లోలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వినియోగదారుల వాహనాలను పార్క్ చేసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దనున్నారు.
కాగా, పంజాగుట్ట, అమీర్‌పేట మున్సిపల్ మార్కెట్ల నిర్మాణానికి ఇప్పటికే జీహెచ్ఎంసీ నిర్మాణ ఏజెన్సీల నుంచి బిడ్లను జీహెచ్ఎంసీ ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టుకు 2022లోనే పరిపాలన అనుమతులు కూడా జారీ చేసింది. ఏడాదిలోగా ఈ నిర్మాణాలను పూర్తి చేయాలని గడువు నిర్ణయించింది.
ఈ రెండు మార్కెటల్లోని 'మొదటి అంతస్తులో, 19 దుకాణాలు, కార్యాలయ అవసరాల కోసం రెండు గదులు ఉంటాయి, రెండవ, మూడవ, నాల్గవ అంతస్తులలో, ఒక్కోదాంట్లో 21 దుకాణాలు ఉంటాయి' అని జీహెచ్ఎంసీ అధికారి ఒకరు చెప్పారు. "మొదటి అంతస్తులో, మేము 8 దుకాణాలు, రెండు గదులు నిర్మిస్తాము. రెండు, మూడు, నాలుగో అంతస్తుల్లో వరుసగా 13, 11, 13 షాపులను నిర్మిస్తాం' అని జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు.












Click it and Unblock the Notifications