శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ. 14 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్: మహిళ అరెస్ట్
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. నైరోబీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద 2.027 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం హెరాయిన్ విలువ రూ. 14.2 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
ఎనిమిది దుస్తుల్లోని గుండీలు, మూడు సబ్బుల్లో దాచి తీసుకొచ్చిన హెరాయిన్ ప్యాకేట్లను సీజ్ చేశారు. నిందితురాలు రిపబ్లిక్ ఆఫ్ బురుండి దేశాస్థురాలిగా గుర్తించామని అధికారులు చెప్పారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.

బ్లాక్ మ్యాజిక్ పేరుతో భారీ మోసం
బ్లాక్ మ్యాజిక్‌తో ధనవంతులు కావొచ్చని.. మీ దగ్గరున్న నగదు రెట్టింపు చేస్తానంటూ ఓ దుండగుడు భారీ మోసానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జాన్‌గుయ్ రోస్టండ్ అనే విదేశీయుడు హైదరాబాద్‌లో ఫేక్ కరెన్సీ దందా నిర్వహిస్తున్నాడు. ఐవరి కోస్ట్ దేశానికి చెందిన ఇతడు.. బ్లాక్ మ్యాజిక్‌తో రెండింతలు చేస్తానని.. ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి భారీగా నగదు తీసుకున్నాడు. ఆ తర్వాత అతనికి ఫేక్ కరెన్సీ ఇచ్చాడు.
మొదట్లో నిజమేనని నమ్మిన బాధితుడు.. తనకిచ్చినవి నకిలీ కరెన్సీ అని తెలుసుకుని భోరుమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు.. ఆ విదేశీయుడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ. 10 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఫేక్ కరెన్సీ తయారు చేసేందుకు వినియోగిస్తున్న పేపర్స్, కెమికల్స్, కట్టర్‌ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితుడిపై ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది. గతంలో ఇలాగే కొందరి నుంచి రూ. 25 లక్షలు మోసం చేశాడు. నిందితుడి గురించి ఆరా తీయగా.. అతడు మనదేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తేలడం గమనార్హం.












Click it and Unblock the Notifications