హైదరాబాద్ ఓఆర్ఆర్ 30 ఏళ్లకు లీజు: రూ. 7380 కోట్లు, ఏ సంస్థ దక్కించుకుందంటే?
హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు(ORR) రికార్డు సృష్టించింది. దేశంలో రహదారి రంగంలో జరిగిన అతిపెద్ద అసెట్ మానిటైజేషన్ ఒప్పందాలలో ఒకటిగా తెలంగాణ ప్రభుత్వం జరిపిన ఒప్పందం నిలవనుంది. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ టోల్, ఆపరేట్, ట్రాన్స్పర్(టీవోటీ) ప్రతిపాదికన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును దక్కించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. హెచ్ఎండీఏ నవంబర్ 9, 2022న అంతర్జాతీయ టెండర్లు పిలిచింది. ఆ తర్వాత ఓఆర్ఆర్ లీజ్ టెండర్లను ఖరారు చేసింది. టెండర్లలో మొత్తం 11 సంస్థలు పాల్గొన్నాయి.
ఎన్‌హెచ్ఏఐ నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచామంటున్న అధికారులు, ఆ ప్రక్రియ వివరాలను చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచడం గమనార్హం. ఐఆర్‌బీ కంపెనీ రూ.7,380 కోట్లకు దీన్ని దక్కించుకుంది. ఇప్పుడు 30 ఏళ్ల పాటు ఔటర్ ఔటర్ రింగ్ రోడ్డు(ORR) నిర్వహణ, టోలు వసూలు సదరు సంస్థే బాధ్యతలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం తెచ్చిపెడుతుందని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. దేశంలోని రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఖరారు చేసిన ఉత్తమ బిడ్లలో ఇది ఒకటి అని చెప్పుకొచ్చారు.

కాగా, IRBతో జరిగిన ఒప్పందంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. "ఈ లావాదేవితో పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం వస్తుంది. మౌలిక సదుపాయాలు, రాష్ర్ట అభివృద్ధి ప్రాజెక్టులకు ఇది తలుపులు తెరుస్తుంది. కొత్తగా ఉద్యోగావకాశాలు పెరిగి, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి జరుగుతుంది. ఈ బిడ్ హైదరాబాద్‌పై పెట్టుబడిదారులకు ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. ప్రభుత్వ సరళతర విధానాలే పెట్టబడిదారులను ఆకర్షిస్తున్నాయి. " అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదే విషయంపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. "ప్రభుత్వం అనుసరించిన సులభతర విధానాలే పెట్టుబడుల ఆకర్షణకు కారణమవుతున్నాయి. తెలంగాణలో పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం ఉంది. వ్యాపారాలను స్థాపించాలన్నా, విస్తరించాలన్న తెలంగాణే అనుకూలమని మరోసారి స్పష్టమైంది' అని పేర్కొన్నారు.
టీవోటీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి యాజమాన్యాన్ని కలిగి ఉంటుంది. టీవోటీ అసెట్ మానిటైజేషన్ సిస్టమ్ రెండు ముఖ్యమైన లక్ష్యాలను కూడా అందిస్తుంది: మొదటిది, ఇది పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి రాబడిని అన్‌లాక్ చేస్తుంది. రెండవది, ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యకలాపాలు, పరిపాలనలో ప్రైవేట్ రంగ సామర్థ్యాన్ని ఉపయోగిస్తుంది. కొత్త అవస్థాపన అభివృద్ధి కోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి టీవోటీ సహాయం చేస్తుంది. అసెట్ మానిటైజేషన్ కోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానమని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి యాజమాన్యాన్ని కలిగి ఉంటుందని సీనియర్ ఎంటీ, యూడీ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications