ఏటీఎం క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లింది వాళ్లే.. సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఖాళీ పెట్టె..పోలీసుల వేట ముమ్మరం
హైదరాబాద్ : బ్యాంకుల దగ్గర తచ్చాడుతారు. లక్షలకొద్దీ డబ్బులు డ్రా చేసే కస్టమర్లను వెంటాడుతారు. అదను చూసి దెబ్బ కొట్టి అందినకాడికి ఎత్తుకెళతారు. ఇది చోరీల్లో ఆరితేరిన తమిళనాడు రాంజీ నగర్ కు చెందిన దీపక్ గ్యాంగ్ తీరు. అంతేకాదు ఏటీఎంలలో నగదు నింపే వాహనాలకు ఎసరు పెట్టడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అదే కోవలో హైదరాబాద్ వనస్థలిపురంలో ఏటీఎం క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లారు. చిల్లర పడేసి గార్డు దృష్టి మళ్లించి లక్షలు దోచుకెళ్లారు. మొత్తానికి దొంగల ముఠాకు సంబంధించిన కీలకాధారాలు పోలీసులకు లభించాయి. తీగ లాగితే డొంక కదులుతున్నట్లు దొంగల ఆనవాళ్లు బయటపడుతున్నాయి.

ఆ దొంగల పనే..!
హైదరాబాద్ వనస్థలిపురంలో మంగళవారం (07-05-2019) నాడు ఉదయం జరిగిన ఏటీఎం క్యాష్ బాక్స్ చోరీ కలకలం రేపింది. క్షణాల వ్యవధిలో 58 లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఇది తమిళనాడుకు చెందిన రాంజీనగర్ దీపక్ అలియాస్ దీపూ ముఠా పనిగా తేల్చారు పోలీసులు. ఈ గ్యాంగ్ లో దీపక్ అలియాస్ దీపూతో పాటు ముఖ్య పాత్రదారులుగా సత్య, రవీందర్, మరో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ముఠా సాధారణంగా ఆటోల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతుంటుంది. బ్యాంకుల దగ్గర తచ్చాడుతూ భారీగా నగదు డిపాజిట్ చేసేవారు గానీ, విత్ డ్రా చేసేవారు గానీ వీరి టార్గెట్. అదను చూసి వారిని ఏమార్చుతూ దొంగతనాలకు పాల్పడుతుంటుంది ఈ ముఠా. అలాగే ఏటీఎంలకు డబ్బు పంపిణీ చేసే వాహనాలను వెంటాడుతూ సమయం చూసి చోరీలు చేస్తుంది. గతంలో చెన్నై, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాగే చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ముఠాపై దాదాపు 12కు పైగా కేసులున్నట్లు సమాచారం. 2017లో బెంగళూరులో ఇలాగే ఏటీఎం వ్యాన్ ను అనుసరించి 5 కోట్ల రూపాయలకు పైగా సొమ్మును దోచుకుంది.

10 బృందాలతో గాలింపు
ఉదయం పూట నడిరోడ్డుపై ఏటీఎం క్యాష్ బాక్స్ ఎత్తుకెళ్లిన ఘటనపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. వారంలోగా ఈ ముఠాను పట్టుకుంటామని ఛాలెంజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా 10 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిందితుల స్వస్థలం రాంజీనగర్ లో కూడా కొన్ని బృందాలు మాటువేశాయట. అయితే వనస్థలిపురం చోరీ జరిగి రెండు రోజులు జరుగుతున్నా.. ఇంతవరకు ఈ దొంగల ముఠా రాంజీనగర్ కు చేరుకోలేదట. ఆ క్రమంలో వారు చోరీ చేసిన దగ్గర్నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నారోననే వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
చోరీ జరిగిన తీరుపై ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు రెండు కోణాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బ్యాంకుకు వచ్చే కస్టమర్లను ఈ ముఠా టార్గెట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ సమయానికి ఏటీఎంలకు నగదు పంపిణీ చేసే వ్యాన్ కనిపించడంతో దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారనేది మరో కోణం.
బేగంపేట నుంచి బయలుదేరిన వ్యాన్ ను ఈ గ్యాంగ్ అనుసరించిందా?.. లేదంటే డైరెక్టుగా వనస్థలిపురం దగ్గరే డైరెక్టుగా టార్గెట్ చేసిందా? అనే కోణంలో దృష్టి సారించారు. బేగంపేట నుంచి వనస్థలిపురం వరకు ఆయా రూట్లలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి ఓ నిర్ధారణకు రానున్నారు.

త్వరలోనే పట్టుకుంటాం..!
చోరీ జరిగిన తర్వాత ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. తమిళనాడు క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో సంప్రదించి దీపక్ గ్యాంగ్‌గా నిర్ధారించారు. 58 లక్షల రూపాయల క్యాష్ బాక్స్ ను ఎత్తుకెళ్లిన ముఠా సభ్యులు.. అందులోని నగదును తీసుకుని ఖాళీ బాక్సును మలక్ పేట సులభ్ కాంప్లెక్స్ దగ్గర పడేశారు. అయితే ముఠా సభ్యులు వనస్థలిపురం నుంచి ఎల్బీనగర్.. అక్కడినుంచి దిల్ సుఖ్ నగర్ వైపు పారిపోయారనే నేపథ్యంలో ఆ రూట్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఆగినట్లు గుర్తించారు. అక్కడ వారు పడేసిన ఖాళీ బాక్సును అదే రోజు రాత్రి స్వాధీనం చేసుకున్నారు. అదలావుంటే మలక్ పేట నుంచి నాంపల్లి వైపు దీపూ గ్యాంగ్ వెళ్లిందని పోలీసులు అనుమానిస్తున్నా.. ఆ మేరకు సీసీ ఫుటేజ్ దొరకలేదని సమాచారం. మొత్తానికి నిందితులనైతే గుర్తించిన రాచకొండ పోలీసులు.. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామంటున్నారు.












Click it and Unblock the Notifications