‘కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు..’! కేసీఆర్ నాటకాలు అందుకే!!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఓటర్లందరికీ డబ్బులు పంచారని.. పలు పార్టీల నేతలను కొనుగోలు చేశారని.. అయినా అధికార పార్టీ ఓడి పోయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఎన్ని చేసినా.. బీజేపీ గెలుపును ఆపలేకపోయారన్న కిషన్
ఓటర్లను ప్రలోభ పెట్టే అన్ని పనులు చేసినా.. బీజేపీ గెలుపును ఆపలేకపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా హుజూరాబాద్‌లో అధికార పార్టీ తరపున పని చేసిందన్నారు. హుజూరాబాద్‌లో స్టేట్ సెక్రటేరియట్ ఉందా? అనే విధంగా పనిచేశారని ఎద్దేవా చేశారు. అయినా టీఆర్ఎస్ ఆటలు సాగలేదన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడారు.

దళితులను అవమానించేలా కేసీఆర్ వ్యాఖ్యలు, కొత్త నాటకాలు
దళితులు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఆగం అవుతుంది, అభివృద్ధి చెందదు అని సీఎం మాట్లాడారు.. అంటే దళితులు ముఖ్యమంత్రిగా పనికి రారా? అంటూ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ డైరెక్ట్‌గా మానిటరింగ్ చేసినా.. టీఆర్ఎస్ ఓటమి పాలైందన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, బియ్యం కొనుగోలుపై కొత్త నాటకం మొదలు పెట్టిందని తెలిపారు. కేంద్రం బాయిల్డ్ రైస్ మినహా.. అన్ని కొనుగోలు చేస్తుందని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం వినకుండా యాసంగిపై మాట్లాడుతోందని తెలిపారు. అబద్దాలతోనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కాగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా.. నవంబర్ 26న రాజ్యంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు అంబేద్కర్ పంచతీర్థాల గురించి ఆన్‌లైన్లో చూపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దీంతోపాటు సంక్రాంతిని పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Recommended Video

కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట
మరోవైపు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దళిత బంధు, హుజురాబాద్ ఎన్నికల విజయం నుంచి ప్రజల దృష్టిని మరళ్లించేందుకు రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతా అని మాట్లాడుతున్న కేసీఆర్.. తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ఓట్లు, సీట్లు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని డీకే అరుణ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే, నష్టపరిహారం ఇవ్వాలనే సోయికూడా ముఖ్యమంత్రికి లేదని.. పక్కరాష్ట్రాల్లో మృతి చెందిన రైతులకు రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని డీకే అరుణ విమర్శించారు. కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టు కేసీఆర్ వైఖరి ఉందని చురకలంటించారు. ఉద్యోగం లేక ఆత్మహత్యకు పాల్పడ్డ నిరుద్యోగ యువత సమస్యను గాలికి వదిలేశారని డీకే అరుణ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications