దుబ్బాకలో కేటీఆర్, జీహెచ్ఎంసీలో కేసీఆర్..: కిషన్ రెడ్డి హెచ్చరిక, అక్బరుద్దీన్ కామెంట్స్‌పై ఫైర్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, ఎంఐఎం పార్టీపై కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు చేస్తున్నారంటూ కేసీఆర్ ప్రజలను భయపెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

దుబ్బాకలో కేటీఆర్.. జీహెచ్ఎంసీలో కేసీఆర్..
గ్రేటర్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఇతరులపై నిందలు వేస్తున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దుబ్బాక ఎన్నికల సమయంలో కూడా మంత్రి కేటీఆర్ ఇలాంటి ఆరోపణలే చేశారని, ఇప్పుడు కేసీఆర్ అలా అంటున్నారని విమర్శించారు. ఇతర పార్టీలపై బురద జల్లడం, ప్రజల్లో ఒకరిపై మరొకరికి అపనమ్మకం కలిగించేలా వ్యవహరించడం సరికాదన్నారు.

ఇదేం నిజాం పాలన కాదు..
ఇదేమీ నిజాం రాజ్యం కాదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి శాశ్వతమైన అధికారం కట్టబెట్టలేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని, అధికార యంత్రాంగాన్ని సీఎం ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చేయాలంటారా?
పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీ అహంకారానికి అద్దపడుతున్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ నేతలు ఈ విధంగా మాట్లాడేందుకు ఎవరు కారణమో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎంఐఎంతో కలిసి స్నేహం చేస్తున్నందుకు ప్రజలకు సీఎం కేసీఆర్ సంజాయిషీ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

మతకల్లోలం సృష్టిస్తామంటూ ఊరుకోం..
బీజేపీపై కేసీఆర్, కేటీఆర్‌లు వాస్తవ విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, ప్రభుత్వంలో ఉన్నవాళ్లు సంయమనంతో ఉండాల్సిన అవసరముందన్నారు. ఎల్ఐసీపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దేశంలో ఎక్కడ మతకల్లోలాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఎవరు బెదిరించినా భయపడాల్సిన అవసరం లేదని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని తెలిపారు. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వ హయాంలో దేశం ప్రశాంతంగా ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.