నిందితులను ఎన్‌కౌంటర్ చేసే ఛాన్స్.. నిజాలు బయటకు రాకుండా... : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యపై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఇది వ్యక్తులు చేసిన హత్య కాదని.. పథకం ప్రకారం ఒక వ్యవస్థ చేసిన హత్య అని ఆరోపించారు. ఒకరిద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ఊరుకుంటే కుదరదని అన్నారు. దీని వెనకాల ఉన్న నిజానిజాలను తెరమరుగు చేసేందుకు అవసరమైతే ప్రభుత్వం నిందితులను ఎన్‌కౌంటర్ చేయడానికైనా వెనుకాడదని అన్నారు. ఎన్‌కౌంటర్‌తో చేతులు దులుపుకోవడం కాకుండా ఈ హత్య వెనక ఉన్న పెద్దల హస్తాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

స్పందించకపోతే కేసీఆర్ సమర్థించినట్లే...
వామన్‌రావు దంపతుల హత్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం స్పందించకుంటే ఈ హత్యను ఆయన సమర్థించినట్లు అవుతుందన్నారు. రోడ్డు మీద పోయే సామాన్యులు సైతం హత్యపై స్పందిస్తున్నారని... సీఎంకు కనీస మానవత్వం లేదా అని ప్రశ్నించారు. ఒకరకంగా కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ గూండాలు ఈ హత్యను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ స్పందించకుంటే ఈ గిఫ్ట్‌ను ఆయన స్వీకరించినట్లేనని అన్నారు. హత్యపై ఇంతవరకూ టీఆర్ఎస్ నేతలు స్పందించలేదంటే... ఇందులో ప్రభుత్వ ప్రమేయం కూడా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నాడో లేడో ఎవరికీ తెలియదన్నారు.

ప్రత్యేక బెంచ్‌కు డిమాండ్...
వామన్‌రావు వద్ద ప్రభుత్వ అవినీతికి సంబంధించిన పూర్తి చిట్టా ఉందని... ఆయన్ను లొంగదీసుకునే ప్రయత్నం చేశారని సంజయ్ అన్నారు. ఆయన ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గనందుకే హత్య చేశారన్నారు.ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించిన సంజయ్... సీఎం స్పందించకపోతే ఇందులో ఆయన ప్రమేయం కూడా ఉందనుకోవాల్సి వస్తుందన్నారు. టీఆర్ఎస్ నేతలు స్పందిస్తే సీఎం వారిని బెదిరిస్తాడు కాబట్టి ఆ పార్టీ నేతలెవరూ దీనిపై స్పందించట్లేదన్నారు. వామన్‌రావు దంపతుల హత్యపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. అంతేకాదు,వామన్‌రావు వేసిన కేసులపై ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దంటే అడ్వకేట్లకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

పట్టపగలే దారుణ హత్య...
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను గుర్తు తెలియని దుండగులు పెద్దపల్లి-మంథని రహదారిలో పట్టపగలే దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద ఈ దారుణం జరిగింది. వామన్ రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతుండగా దుండగులు తమ కారుతో వారిని అడ్డగించారు. ఆపై వేట కొడవళ్లు,కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. రక్తపు మడుగులో పడివున్న వామన్‌రావు కుంట శ్రీను ఈ హత్య చేయించినట్లుగా పేర్కొన్నాడు. ఇద్దరినీ ఆస్పత్రి తరలించే లోపే మృతి చెందారు.