సీఐ నాగేశ్వరరావు లీలలు, బీఎండబ్ల్యూ కారు ఇవ్వని వైనం, వైద్య పరీక్షలు పూర్తి, కోర్టుకు తరలింపు
సీఐ నాగేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. వివాహితపై లైంగిక దాడి తర్వాత కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు కూడా నాగేశ్వరరావు వల్ల ఇబ్బంది కలిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరుతున్నారు. తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతకుముందు ఓ బీఎండబ్ల్యూ కారు ఓనర్‌ను కూడా ఇబ్బందికి గురిచేశాడట. ఆయన తనకు జరిగిన ప్రాబ్లమ్‌ను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

కారు ఇవ్వని కాప్..
ఇదివరకు హైకోర్టు ఆదేశాలను కూడా నాగేశ్వరరావు ఖతారు చేయలేదట. ఓ కేసులో సీజ్ చేసిన బీఎండబ్ల్యూ కారును టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో కస్టడీలో ఉంచుకున్నాడట. సదరు బాధితుడు ఎంత ప్రయత్నించినా కారు ఇవ్వలేదని తెలిసింది. తన కారు తనకు ఇవ్వమని కోరితే.. టార్చర్ చేశారని తెలిసింది. పోలీసులు కోరడంతో అతను ముందుకు వచ్చినట్టు తెలిసింది. నాగేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గోప్యంగా విచారణ జరుపుతున్నారు.

వైద్య పరీక్షలు పూర్తి..
నాగేశ్వరరావుకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అతనిని హయత్ నగర్ కోర్టుకి తరలిస్తారు. వివాహితపై రేప్, కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు. బెదిరింపులకు పాల్పడిన రివాల్వర్‌ను ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లైంగికదాడి జరిగిన స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించారు. బాధితురాలికి ఇప్పటికే మెడికల్ టెస్టులు పూర్తి చేశారు. కేసులు సైంటిఫిక్ ఎవిడెన్స్ కీలకం కానున్నాయి. ఐ విట్నెస్ స్టేట్ మెంట్లు కూడా రికార్డు చేశారు.

భద్రత కల్పించాల్సిన అధికారే
మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో పోలీసు శాఖ ఉలిక్కిపడింది. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావుపై ఇప్పటికే సస్పెండ్ చేశారు. వాస్తవానికి నాగేశ్వరరావు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించాడు. అక్కడి నుంచి మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. కానీ ఇంతలోనే కీలక ఆరోపణలు రావడం.. సస్పెండ్ కావడం చకచకా జరిగిపోయాయి. ఆయన పేరు ఒక్కసారిగా మసకబారిపోయింది.