మనమే ముందుండాలి: తెలంగాణ రోబోటిక్స్ ప్రేమ్‌వర్క్ ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో రోబోటిక్స్ ఎకో సిస్టంను మెరుగుపర్చే దిశగా తెలంగాణ స్టేట్ రోబోటిక్ ఫ్రేమ్ వర్క్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం టీ హబ్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, పౌరుల జీవితాలను మెరుగుపరిచేందుకు సాంకేతిక ఆవిష్కరణలకు మార్గదర్శకంగా నిలుస్తోందని కేటీఆర్ అన్నారు.
ప్రస్తుతం సమాజంలో జరిగే చాలా సమస్యలను పరిష్కరించేందుకు రోబోటిక్స్ ఉపయోగపడుతున్నాయని కేటీఆర్ అన్నారు. అభివృద్ధిలో ఐటీ వినియోగం పెంచాలని.. టెక్నాలజీని వాడాలని సూచించారు. రోబోటిక్స్ సాంకేతికత వేగంగా పెరుగుతోందని.. గత మూడు దశాబ్దాల్లో మూడు రెట్లు వాటి వినియోగం పెరిగిందని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశం రోబోటిక్స్ వినియోగంలో పదో స్థానంలో ఉందని గుర్తు చేశారు. త్వరలోనే ఐదో స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు మంత్రి కేటీఆర్.

ఈ రోబోటిక్స్‌ని ప్రజా సమస్యల పరిష్కారంలో ఉపయోగించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచం అంతా టెక్నాలజీతో వేగంగా ముందుకు సాగుతుందన్నారు. ఈ సాంకేతిక యుగంలో ప్రతి దేశంలో రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తున్నారన్నారు. ప్రస్తుతం సాంకేతికత ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. ఇలాంటి సమాజంలో మనమందరం జీవిస్తున్నామని చెప్పారు. ఆవిష్కరణలను, వ్యవస్థాపకులను ప్రోత్సహించడమే ఈ రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్ ముఖ్య ఉద్దేశమన్నారు కేటీఆర్.
సాంకేతిక రంగంలో వచ్చే ప్రతి కొత్త టెక్నాలజీని అందరూ నేర్చుకోవాలని కేటీఆర్ అన్నారు. ఇలా వచ్చే ప్రతి కొత్త ఆవిష్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. వచ్చే ప్రతి టెక్నాలజీని అలవాటు చేసుకునేలా తమ ప్రభుత్వం ఉండాలనుకొంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వీటి కోసమే రాష్ట్రంలో ఈ రంగంలోని పరిశ్రమలు, అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, రాష్ట్రంలో రోబోటిక్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ డైరెక్టర్ రమాదేవి, ఐటీ ప్రధాన కార్యదర్శి జయశంజన్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications