కేసీఆర్‌పై కామెంట్లా..? మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలుసా..? మంత్రి కేటీఆర్
ప్రతిపక్ష నేతలపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌పై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని ఫైరయ్యారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని వారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే మహారాష్ట్రలో చూడండి అని ఉదహరించారు. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేస్తే.. కేంద్రమంత్రిని కూడా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఇటు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కు లేక పక్క పార్టీలో నుంచి ఒకర్ని దిగుమతి చేసుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తొత్తు, బినామీని తీసుకొచ్చి పార్టీకి అధ్యక్షుడిని చేశారని ఆరోపించారు. డబ్బు సంచులతో దొరికిపోయినొన్ని అధ్యక్షుడిని చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. నోరు పారేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణ సాధించిన నేత, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర గల నాయకుడు, ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. అలాంటి నేతను పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన కాలి గోరికి కూడా సరిపోని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదు.. ప్రతిపక్షాలకు కూడా అలానే బుద్ధి చెప్తాం అని కేటీఆర్ అన్నారు.
సహనానికి ఓపిక ఉంటుంది. ఓపికకు కూడా హద్దులుంటాయి. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడాలని కోరుకుంటారు. కానీ ఆ పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. తప్పని పరిస్థితుల్లోనే మాట్లాడుతున్నాం అని.. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటే కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా లోపల పడేశారు. మరి మేం కూడా చేయమంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.జర్నలిస్టు ముసుగులో ఉండి కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జర్నలిజం ముసుగులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications