గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 35వేలకు పైగా గణేశ మండపాలు; ఖైరతాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు!!
హైదరాబాద్ : గణేశ నవరాత్రి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం రెడీ అయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జిహెచ్ఎంసి పరిధిలో గణేశ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి మత ఘర్షణలకు తావులేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం చేసిన సూచనలతో, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా గణేశ మండపాలు
ఆగస్టు 31న ప్రారంభం కానున్న గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35 వేలకు పైగా మండపాలను ఏర్పాటు చేశారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 9న పలు విగ్రహాల నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో క్రిందికి వేలాడే విద్యుత్ లైన్లు, లైటింగ్ వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.

ఖైరతాబాద్ గణేశ ఉత్సవాల దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు
ఖైరతాబాద్‌లో బుధవారం ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల దృష్ట్యా నిమజ్జనం రోజు వరకు, భక్తులు మరియు సందర్శకుల రద్దీని బట్టి పరిసరాల్లో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దీని ప్రకారం, మింట్ కాంపౌండ్, రాజీవ్ గాంధీ విగ్రహం, నిరంకారి జంక్షన్, బడా గణేష్ వైపు రాజ్‌దూత్ లేన్, ఇక్బాల్ మినార్, ఐమాక్స్ థియేటర్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ మింట్ కాంపౌండ్ వైపు, ఖైరతాబాద్ జంక్షన్ మరియు ఖైరతాబాద్ పోస్టాఫీస్, ఖైరతాబాద్ రైల్వే గేట్, సైఫాబా ఓల్డ్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

నిమజ్జనం కోసం 24 కృత్రిమ పాండ్ లు
విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని పలు ప్రాంతాలలో కృత్రిమ పాండ్ లను ఏర్పాటు చేస్తున్నామని వాటిని వినియోగించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా ఆరు లక్షల మట్టి గణపతి విగ్రహాలను జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ, పీసీబీ ఆధ్వర్యంలో పంపిణీ చేశామని మంత్రి పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం జరిగేలా అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు.ఈ సంవత్సరం నుండి ఇందిరాపార్క్‌లో ఎన్టీఆర్ స్టేడియం, అమీర్‌పేట క్రీడామైదానంలో రెండు ఎఫ్‌ఆర్‌పీ చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. వారం చివరి నాటికి నగరవ్యాప్తంగా ఇలాంటి 24 కృత్రిమ పాండ్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.

సుప్రీంకోర్టు హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జన నిషేధించిన నేపధ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్‌లో భక్తులు తమ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వివిధ ప్రదేశాలలో పోర్టబుల్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ వాటర్ పాండ్‌లను ఏర్పాటు చేస్తుంది. హుస్సేన్ సాగర్ మరియు ఇతర నీటి వనరులలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నిషేధించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది.