చనిపోతూ భర్తకు చివరి ఫోన్ కాల్... ధీనంగా ప్రశ్నించిన వివాహిత... ఆపై అతనూ ఆత్మహత్యాయత్నం...
సూర్యాపేటలో ఓ నవ వధువు ఆత్మహత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ అత్తింటి అదనపు కట్నం వేధింపులకు బలైపోయింది. పురుగుల ముందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆమె చివరి క్షణంలో భర్తకు ఫోన్ చేసి... 'నన్నెందుకు వదిలేసి వెళ్లావు..' అని ధీనంగా ప్రశ్నించింది. పరిస్థితి విషమించడంతో లావణ్య మృతి చెందగా... భార్య మృతి వార్త తెలిసి భర్త కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

అసలేం జరిగింది...
పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌కు చెందిన ఎడ్ల సుందరయ్యకు నలుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తె లావణ్య (25) వెటర్నరీ సైన్స్ చదివి వెటర్నరీ డాక్టర్‌గా ఉద్యోగం తెచ్చుకుంది. కాలేజీ రోజుల్లో సూర్యాపేట చర్చి కాంపౌండ్‌కు చెందిన పెదపంగు ప్రణయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇదే క్రమంలో ప్రణయ్‌కి ఏఈవోగా ఉద్యోగం వచ్చింది. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాక ఇరువురు తమ ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించారు.

కట్న కానుకలు వద్దన్నప్పటికీ...
తనకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదని... లావణ్యను ఇచ్చి పెళ్లి చేస్తే చాలని పెళ్లికి ముందు ప్రణయ్ ఆమె తండ్రి సుందరయ్యతో చెప్పాడు. అయినప్పటికీ వివాహ సమయంలో రూ.4లక్షలు నగదు,8 తులాల బంగారం,20 గుంటల సాగు భూమిని కట్నంగా ఇచ్చాడు. గతేడాది జూన్ 12న కూతురి వివాహాన్ని ఘనంగా జరిపించాడు. పెళ్లయిన ఆర్నెళ్ల పాటు లావణ్య-ప్రణయ్‌ల కాపురం సాఫీగానే సాగినప్పటికీ ఆ తర్వాత అదనపు కట్నం వేధింపులు మొదలయ్యాయి.

లావణ్య ఆత్మహత్య...
భర్త ప్రణయ్‌తో పాటు మామ కరుణానిధి, అత్త ఉజ్వల, మరిది సంజయ్ లావణ్యను అదనపు కట్నం కోసం వేధించారు. ఇదే విషయమై ఈ నెల 1న లావణ్య-ప్రణయ్‌ల మధ్య గొడవ జరిగింది. అనంతరం లావణ్యను కొర్లపహాడ్‌లోని ఆమె పుట్టింటిలో దిగబెట్టి వచ్చాడు ప్రణయ్. మరుసటిరోజు సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లావణ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగాక చివరగా భర్తకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పింది. 'నన్ను ఎందుకు వదిలేసి వెళ్లావు..' అంటూ ధీనంగా ప్రశ్నించింది. లావణ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందింది.

ప్రణయ్ ఆత్మహత్యాయత్నం
లావణ్య మృతదేహంతో ప్రణయ్ ఇంటి ముందు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో ప్రణయ్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. 'అమ్మా నాన్న.. నన్ను క్షమించండి.. నా భార్య లావణ్య దగ్గరికి వెళ్లిపోతున్నా.. నా భార్య చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించండి.. చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..' అంటూ సూసైడ్ నోట్ రాశాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మరోవైపు బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రణయ్,అతని కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.