Hyderabad: వందేభారత్ సహా రూ. 11,355 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మోడీ పర్యటనలో భాగంగా మొత్తం రూ. 11,355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడతారని చెప్పారు. 8న మొదట బేగంపేట విమానాశ్రాయానికి ప్రధాని మోడీ చేరుకుంటారని.. అక్కడ్నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తారని తెలిపారు.
అనంతరం తెలుగు రాష్ట్రాల(సికింద్రాబాద్-తిరుపతి) మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత రూ. 715 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారని కేంద్రమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు ఉపయోగపడేలా ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రద్దీ సమయంలో 25వేల మంది ప్రయాణికుల అవసరాలను తీరుస్తోందని.. ఈ అభివృద్ధి, ఆధునీకరణ పనులు పూర్తయితే 3.25 లక్షల మందికి సేవలందించేలా స్టేషన్ సామర్థ్యం పెరుగుతుందన్నారు.

ఇక, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ మధ్య రూ. 1410 కోట్ల వ్యయంతో నిర్మించిన 85 కిలోమీటర్ల డబ్లింగ్ రైల్వే లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా హైదరాబాద్ శివారు పట్టణాలతో అనుసంధానం చేస్తూ 13 కొత్త ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఇక తాజాగా చేపట్టనున్న, అందుబాటులోకి వచ్చిన అభివృద్ధి పనులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలపై తీసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ను ప్రధాని మోడీ తిలకిస్తారని చెప్పారు.

ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారని.. అక్కడ్నుంచే రూ. 7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ. 1366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారని కేంద్రమంత్రి తెలిపారు. ఆ తర్వాత బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారని తెలిపారు.












Click it and Unblock the Notifications