రేవంత్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ.. టీఆర్ఎస్ కు జై కొట్టిన ముఖ్య అనుచరుడు
Recommended Video

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఐటీ దాడులు, ఎన్నికల సంఘం నోటీసులు, తాజాగా అరెస్ట్. టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి స్ట్రాటజీకి ఎదురుదెబ్బలే మిగులుతున్నాయి. ఆయనకు చెక్ పెట్టేందుకు గులాబీనేతలు స్కెచ్చులమీద స్కెచ్చులు వేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డ రాజారాం యాదవ్ హస్తం గూటికి గుడ్ బై చెప్పి ఎంచక్కా కారు ఎక్కేశారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రాయలేని పదజాలం వాడుతున్నారు. కేసీఆర్ ను అంతటి స్థాయిలో ఆరోపిస్తున్న నేతల్లో రేవంత్ రెడ్డిదే మొదటి ప్లేస్. దీంతో ఆయనపై గులాబీ వర్గం కక్ష సాధిస్తోందనే వాదనలున్నాయి. అంతేకాదు ఆయన అనుచరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి కావాల్సిన ముఖ్యుడు రాజారాం యాదవ్ టీఆర్ఎస్ లో చేరడం చర్చానీయాంశంగా మారింది.

టీఆర్ఎస్ వయా కాంగ్రెస్, టీడీపీ
విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన రాజారాం యాదవ్ కు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యం లభించలేదనే ప్రచారముంది. దీంతో 2014 ఎన్నికల నాటికి టీడీపీలో జాయిన్ అయ్యారు. చంద్రబాబు పిలుపు మేరకు ఆయన సైకిలెక్కినట్లు వార్తలొచ్చాయి. దీంతో రాజారాం యాదవ్ కు టీడీపీ అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టారు. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం పెరిగింది.
రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ముద్రపడ్డ రాజారాం యాదవ్ తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ వర్గీయునిగా ఆర్మూర్, బాల్కొండ స్థానాల నుంచి టికెట్ ఆశించారు. కానీ ఆయన కోరిక ఫలించలేదు. ఆర్మూర్ స్థానం నుంచి ఆకుల లలితకు, బాల్కొండ నుంచి ఈరవత్రి అనిల్ కు కాంగ్రెస్ టికెట్లు దక్కాయి. ఈనేపథ్యంలో అనూహ్యంగా ఎన్నికలకు మూడు రోజుల ముందు నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోవడం హాట్ టాపికయింది. ఈయన కారెక్కడానికి ఆర్మూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రయత్నించినట్లు సమాచారం. రాజారాం యాదవ్ ను కారెక్కిస్తే బీసీ ఓట్లు కలిసొస్తాయనేది ఆయన అంతరంగంగా కనిపిస్తోంది.
రాజారాం యాదవ్ నేపథ్యం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రాజారాం యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనూహ్యంగా టీడీపీలో చేరారు. 2014 లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన ఆశన్నగారి జీవన్ రెడ్డి విజయం సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ సురేశ్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదనంతర పరిణామాలతో టీడీపీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు రాజారాం యాదవ్.

రేవంతన్న ఉన్నడు.. టికెట్ నాకే..!
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాక రాజారాం యాదవ్ కూడా కండువా మార్చేశారు. సైకిల్ కి బై బై చెప్పి హస్తం గూటికి చేరారు. ఇక్కడ కూడా ఆయనకు అధికార ప్రతినిధి పదవి లభించింది. ఇప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్, బాల్కొండ స్థానాల్లో ఏదైనా ఒకటి తనకు కేటాయించాలని అధిష్టానానికి నివేదించారు. రేవంత్ రెడ్డి వర్గీయునిగా టికెట్ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అయితే రాజారాం యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ మొండిచేయి చూపింది.

అధ్యక్షా అని అనాలని ఉన్నా..! కలిసిరాని కాలం
ఎన్నికల వేళ పార్టీలు మార్చుతారని రాజారాం యాదవ్ కు పేరుంది. ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న రాజారాం యాదవ్ కు కాలం కలిసిరావడం లేదనేది మరో వాదన. ఈసారి కూడా కాంగ్రెస్ టికెట్ రాక ఆపార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంతన్న కూడా న్యాయం చేయలేకపోయాడనేది ఆయన ఫీలింగ్ లా కనిపిస్తోంది. తన ఉద్యమ సహచరులు బాల్క సుమన్, పిడమర్తి రవి లాంటి కొందరికి టీఆర్ఎస్ సముచిత ప్రాధాన్యం కల్పించింది. అయితే అప్పట్లో టీఆర్ఎస్ ను విభేదించి టీడీపీలో చేరిన రాజారాం యాదవ్ తిరిగి కారెక్కడం చర్చానీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఆయనకు ఎలాంటి తాయిలాలు అందాయోననే ఊహాగానాలు జోరందుకున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఈ ఆపరేషన్ ఆకర్ష్ సాగిందనేది మరో కోణం.












Click it and Unblock the Notifications