తెలంగాణ మార్కెట్ యార్డుల్లోనూ ‘అన్నపూర్ణ’: అన్నదాతలకు రూ. 5కే భోజనం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆకలి తీర్చే మరో ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొస్తోంది. రాష్ట్రంలో అన్నపూర్ణ పథకం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహాయకుల కోసం రూ. 5కే భోజనం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ భోజన సౌకర్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 ఉప యార్డుల్లో వీటన్నింటికీ కలిపి సీజన్ సమయంలో రోజూ దాదాపు 8వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను తీసుకొచ్చే రైతులు.. రోజంతా యార్డులోనే ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట కూడా అక్కడే ఉండాల్సి వస్తోంది.

అయితే, మార్కెట్ యార్డుల్లో భోజన వసతి లేకపోవడంతో రైతులు సమీపంలోని క్యాంటీన్లు, హోటళ్లకు వెళ్లి భోజనం చేస్తుంటారు. పలు మార్కెట్ యార్డుల్లో మంచినీటి వసతి కూడా లేకపోవడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే రైతులకు రాయితీపై భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ పథకం ద్వారా నగరాలు, పట్టణాల్లోని ఆస్పత్రుల్లో సహాయకుల కోసం రూ. 5కి భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ. 21 రాయితీ చెల్లిస్తోంది. ఆస్పత్రుల్లో అనేక మంది పేద రోగుల బంధువుల ఆకలి తీరుస్తున్న ఈ పథకం ఇప్పుడు మార్కెట్ యార్డుల్లోని అన్నదాతలకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక త్వరలోనే రాష్ట్రంలోని మార్కెట్ యార్డుల్లో కూడా రూ. 5కే భోజనం పథకం ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications