Omicron: 909 మంది విదేశాల నుంచి, 13 మంది నమూనాలు జినోమ్ సీక్వెన్సింగ్‌కు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 39,140 నమూనాలను పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 198 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. ఇప్పటి వరకు 2.86 కోట్లకుపైగా నమూనాలను పరీక్షించగా.. 6,76,574 మంది కరోనా బారిన పడ్డారు.

తెలంగాణలో 3723 యాక్టివ్ కేసులు
రాష్ట్రంలో కరోనా బారినపడినవారిలో తాజాగా మరో 153 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,68,854కి చేరింి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 3997 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3723 యాక్టివ్ కేసులున్నాయి. ఇది ఇలావుండగా, ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనల నేపథ్యంలో విదేశీ ప్రయాణికుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తెలంగాణకు వచ్చిన విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలను నిర్వహిస్తోంది. లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి తరలిస్తోంది.

13 మంది నమూనాలు జినోమ్ సీక్వెన్సింగ్‌కి
ఎట్ రిస్క్ దేశాల నుంచి ఇప్పటి వరకు 909 మంది తెలంగాణకు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 219 మంది హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో 9 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 13 మంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆ 13 మంది నమూనాలను ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు వైద్యశాఖ తెలిపింది.

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యలో అప్రమత్తం
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా వేసింది. పరీక్షల అనంతరమే వారిని బయటకు పంపుతోంది. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్నా.. పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా ఉన్నట్లు తేలితే వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి, వారి నమూనాలను జినోమ్
సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులను తప్పనిసరి చేశారు. మాస్కు ధరించకుంటే రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో ఈ జరిమానాలను విధించారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రజలకు సూచించారు.