సిలికాన్ వ్యాలీ లాంటి హైదరాబాద్‌లో ఆ సాఫ్ట్‌వేర్ లేదా?: నారాయణ, శ్రీచైతన్య.. జీవోల ఇష్యూపై హైకోర్టు
హైదరాబాద్: నారాయణ, చైతన్య కాలేజీలకు సంబంధించిన వ్యవహారంపై ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదికపై సోమవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ఎలాంటి అంశాలను పొందుపర్చలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్న..
ఈ నివేదికలో కీలకమైన అంశాలనే విస్మరించారని.. మరోసారి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించింది. 45 కాలేజీలు నిబంధనలను ఉల్లంఘించాయంటూ హైకోర్టుకు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ కాలేజీల్లో 20వేల మంది చదువుతున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో గుర్తింపులేని కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

కాలేజీల్లో విద్యార్థుల మృతి... హైకోర్టు ప్రశ్నల వర్షం
నారాయణ, చైతన్య కాలేజీల్లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు? కళాశాలల్లో వసతుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఆ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు మృతి చెందారు? తదితర పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

సిలికాన్ వ్యాలీ లాంటి హైదరాబాద్‌లో ఆ సాఫ్ట్‌వేర్ లేదా?
ఇది ఇలావుంటే, తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచకకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్‌సైట్‌లో ఎందుకు పెట్టడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. భారత సిలికాన్ వ్యాలీలాంటి హైదరాబాద్ మహానగరంలో వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్ లభించడం లేదా? అని సర్కారును నిలదీసింది.

28లోపు సమాధానమివ్వండి..
ప్రభుత్వ ఉత్తర్వులను పబ్లిక్ డొమైన్‌లో పొందుపర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ నేత పేరాల శేఖర్ రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సుమారు 40 పేజీల జీవోలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయని, ప్రజలకు అందుబాటులో ఉంచలేదని శేఖర్ రావు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఎందుకు పొందుపర్చడం లేదో తెలుపుతూ ఫిబ్రవరి 28లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications