తెలంగాణ మంత్రికి తప్పిన ప్రమాదం... 30ని. లిఫ్టులో ఇరుక్కుపోయిన కొప్పుల ఈశ్వర్..
తెలంగాణ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన 30నిమిషాల పాటు లిఫ్టులోనే ఇరుక్కుపోయారు. లిఫ్ట్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు టెక్నీషియన్స్ రంగంలోకి దిగి లిఫ్ట్ లాక్ ఓపెన్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... సైఫాబాద్‌లో శుక్రవారం(నవంబర్ 6) నిర్వహించిన ఓ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్‌కి బయలుదేరారు. ఈ క్రమంలో లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోవడంతో మంత్రితో పాటు మరికొందరు అందులోనే చిక్కుకుపోయారు. చాలాసేపు లిఫ్ట్ లాక్ ఓపెన్ కాకపోవడంతో అందరూ ఆందోళన చెందారు. చివరకు టెక్నీషియన్స్ రగంలోకి దిగి లిఫ్ట్ లాక్ ఓపెన్ చేయడంతో మంత్రి సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. లిఫ్ట్ హఠాత్తుగా ఆగిపోవడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

కాగా,గురువారం(నవంబర్ 6) మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో పీసీఆర్, పీఓఏ చట్టాల అమలుకు సంబంధించిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలలో మరింత ధైర్యమిచ్చే విధంగా ఈ చట్టాల అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచార కేసుల విచారణను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను జనంలోకి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌లో 'సివిల్ రైట్స్ డే'ను విస్త్రత స్థాయిలో నిర్వహించే ఆలోచన ఉందన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మరింత చురుగ్గా, బాధ్యతాయుతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్లకు లేఖలు రాయాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications