తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మరికొద్దిరోజుల్లో హైదరాబాద్‌లో 40 డిగ్రీలు దాటే ఛాన్స్..
తెలంగాణలో ఎండలు అప్పుడే ముదిరిపోయాయి. ఇంకా మార్చి నెల కూడా దాటకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఆదివారం(మార్చి 28) హైదరాబాద్‌లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్,మంచిర్యాల,కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇప్పటికే 42 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి,జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండాకాలం ప్రారంభంలోనే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో... ఏప్రిల్,మే నెలల్లో ఎండలు మరింత మండిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం... మార్చి ప్రారంభంలో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మరికొద్దిరోజుల్లో హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటే అవకాశం ఉంది. ఆదివారం(మార్చి 28) హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో 39.4డిగ్రీల ఉష్ణోగ్రత,ఆసిఫ్‌నగర్‌లో 39.3డిగ్రీల ఉష్ణోగ్రత,ఉప్పల్‌లో 39.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత వారం రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 24డిగ్రీలుగా నమోదవుతున్నాయి.గడిచిన 24గంటల్లో అత్యధికంగా జగిత్యాలలోని అల్లిపూర్‌లోని 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

గతేడాది మార్చిలో హైదరాబాద్‌లో గరిష్ఠంగా 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఈ ఏడాది ఇప్పటికే 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ నుంచి ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండటంతో పగటిపూట 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆదిలాబాద్,మంచిర్యాల,కుమ్రం భీమ్ జిల్లాలతో పాటు కరీంనగర్,ఖమ్మం,నల్గొండ జిల్లాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications