సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటి మహిళా గూడ్స్ రైల్వే గార్డు మాధవి
రైల్వే శాఖలో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. అయితే అత్యంత కష్టమైన రైల్వే గార్డ్ గా విధుల నిర్వహణలో నూ మహిళలు మేము సైతం అంటున్నారు. ప్రయాణికులను చేరవేసే రైళ్లలో రైల్వే గార్డ్ గా విధుల నిర్వహణ అంత కష్టం కాకపోవచ్చు కానీ, సరకులను చేరవేసే వాణిజ్యపరమైన గూడ్స్ రైలులో రైల్వే గార్డుగా విధులను నిర్వర్తించడం కత్తి మీద సామే. ఎందుకంటే ఏ సమయంలోనైనా, ఎక్కడపడితే అక్కడ గూడ్స్ రైళ్లను ఆపవలసి వస్తే ఆ సమయంలో కూడా రైల్వే గార్డులు ధైర్యంగా పని చేయాలి. రాత్రి సమయాల్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలో రైలును ఆపినా విధి నిర్వహణలో ఎలాంటి బెరుకు లేకుండా ఉండాలి అంటే అది మహిళల వల్ల కాదు అని నిన్న, మొన్నటి వరకూ భావించారు.. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ మహిళా లోకం ముందుకు వస్తుంది.

అందులో భాగంగానే గూడ్స్ గార్డుగా ఓ మహిళ నియమితులయ్యారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ మహిళ విధులు నిర్వర్తించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట రైల్వే డ్రైవర్ల కార్యాలయం కేంద్రంగా మాధవి గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాధవికి శిక్షణ ఇప్పించి వర్కింగ్ ఆర్డర్ అందచేసినట్లు కాజీపేట రైల్వే ఏరియా ఆఫీసర్ వెల్లడించారు.
కాజీపేట నుండి సనత్ నగర్ వెళ్లే యూటీసీఎం గూడ్స్ గార్డుగా ఆమె వెళ్లినట్లు తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్‌లో మొట్టమొదటి మహిళా గార్డుగా మాధవి ఒక్కరే ఉన్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా , విధి నిర్వహణలో పురుషులతో సమానం అని మాధవి రైల్వే గార్డుగా విధులు నిర్వర్తించటం అభినందనీయం.












Click it and Unblock the Notifications