దారిలో నోట్ల కట్టలు.. దగ్గరికెళ్లి చూసి నోరెళ్లబెట్టిన వాహనదారులు
నోట్ల గుట్టలు కనిపిస్తే.. ఆనందం.. ఆశ్చర్యంలో మునిగిపోతారు. అవును ఎవరిదీ అని అడగడం మానేసి తీసుకోవడానికి జనం ట్రై చేస్తారు. ఇదీ నిజం కూడా.. నోట్ల రద్దు సమయం తర్వాత కరెన్సీ నోట్ల గురించి ఏం చేసినా హైప్ నెలకొంది. ఇప్పుడు తాజాగా ఓ హైవేపై నోట్ల కట్టల గుట్టలు కనిపించాయి. దీంతో ఆ దారి వైపు వెళ్లే వారు దగ్గిరికీ వెళ్లి చూశారు.

నోట్ల కట్టలు
రోడ్డు పక్కన కనిపించిన కుప్పలుగా కనిపిస్తున్న కరెన్సీ నోట్ల గుట్టల్ని చూసి వాహనదారుల కళ్లు చెదిరాయి. దూరం నుంచి కరెన్సీ నోట్ల కుప్పను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. దగ్గరికి వెళ్లి చూసి నోరెళ్లబెట్టారు. అవి కరెన్సీ నోట్లే..కానీ కరెన్సీ నోట్ల తుక్కు.. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద రోడ్డుపై గుట్టలుగా పడి ఉన్న చిరిగిన నోట్లు కలకలం రేపాయి.

చిరిగిన కరెన్సీ
హైదరాబాద్-నాగ్‌పుర్ నేషనల్ హైవేపై చిరిగిన కరెన్సీ కుప్పలుకుప్పలుగా కనిపించటంతో జనాలు షాక్ అయ్యారు. రోడ్లపై గాలికి ఆ కరెన్సీ నోట్ల ముక్కలు చుట్టుపక్కల ప్రాంతాలకు కొట్టుకుపోవడంతో కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు అయోమయంలో ఉండిపోయారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు స్పాట్‌కు చేరుకుని కరెన్సీ నోట్ల తుక్కును స్వాధీనం చేసుకున్నారు. అవి అక్కడికి ఎలా వచ్చాయి? తుక్కుగా ఎలా మారాయి? అన్న విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇలా పడి ఉండొచ్చు
నోట్ల కట్టలు ఉన్న సంచి లారీ పైనుంచి కిందపడి ఉంటుందని, దానిపై నుంచి వాహనాలు వెళ్లడంతో నోట్లన్నీ ఇలా చినిగిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. నోట్ల కట్టలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు? ఎవరు ఈ పని చేస్తున్నారు? ఆ కరెన్సీ నోట్లు ఒరిజినలేనా? లేక నకిలీవా? అసలైనవే అయితే ఇలా ఎందుకు తుక్కుగా మార్చారు? అనే పలు అనుమానాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఎలా పడిందబ్బా
రిజర్వు బ్యాంకు ఇలా చేసే అవకాశం లేదని.. పాత నోట్లను రహస్య ప్రదేశంలో కాల్చివేస్తుందని బహుశా వాటిని తరలిస్తుండగా వాహనంలోంచి పొరపాటున పడిపోయి ఉండవచ్చనని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. బ్లాక్ మనీగానీ..నకిలీ నోట్లు కానీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నామని చెప్పారు. నోట్లు ఉన్న సంచి ఏ వాహనం నుంచి జారిపడిందో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీను పరిశీలిస్తున్నామని వివరించారు.












Click it and Unblock the Notifications