వరదలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు
హైదరాబాద్ లో వర్షాల ఎఫెక్ట్స్ సామాన్యులనే కాదు ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతోంది. తాజాగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు వరద కష్టాలు తప్పలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు వరద నీళ్లలో ఇరుక్కుపోవడంతో దానిని బయటకు తీసుకురావడం కోసం సదరు ఎమ్మెల్యే నానాతంటాలు పడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. నగర రహదారుల పరిస్థితిని అందరూ ప్రశ్నించేలా చేస్తుంది.
కడియం సమర్ధత ముందు సీఎం కేసీఆర్ బలాదూర్ : మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్ ను ముంచేస్తున్న వర్షాలు
గత రెండు రోజులుగా హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలంగా మారుతోంది. కాస్త వర్షం పడినా సరే నగర రహదారులు చెరువులను తలపిస్తాయి. ఎక్కడికి వెళ్లాలన్నా వాహనచోదకులకు తీవ్రమైన ఇబ్బంది తలెత్తుతుంది. తాజాగా కురిసిన వర్షాలతో హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది పొంగి ప్రవహిస్తోంది. ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్, నాగోల్, ఓల్డ్ సిటీ ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు ఇళ్ళల్లో నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

వరదనీటిలో చిక్కుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు.. కారు తోసిన ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే హస్తినాపురం డివిజన్ సాగర్ ఎంక్లేవ్ లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటిస్తుండగా ఆయన కారు వరదనీటిలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నం చేసినా కారు ముందుకు కదలకపోవడంతో, సెక్యూరిటీతో పాటు ఎమ్మెల్యే కూడా కిందికి దిగి కారును తోశారు. చాలాసేపు కుస్తీ పట్టిన తర్వాత కారు వద్ద నుండి బయటకు వచ్చింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేనే వరదలో చిక్కుకుని అష్టకష్టాలు పడడం హైదరాబాద్ మహానగర రోడ్ల దుస్థితికి అద్దం పడుతుంది.

వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం
విపరీతంగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు ఇప్పటికే జలమయం కాగా, పలు లోతట్టు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలంతా వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.