ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు
హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం శుక్రవారం బలహీనపడింది. ఉపరితల ద్రోని ఈశాణ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుంచి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు ఏర్పడింది.
ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. కాగా, శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. ఈదురుగాలులు కూడా వీస్తాయి. శనివారం, ఆదివారం కూడా రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీయనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఉత్తర, తూర్పు, సెంట్రల్, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

ఏపీలోనూ వర్షాలు
ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రానున్న రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు బీహార్ ప్రాంతం నుంచి దక్షిణ తీరప్రాంతమైన ఒడిశా వరకు మరో ద్రోణి వ్యాపించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
యానాంలో రాగల మూడ్రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో తిలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలతో పంటలు పాడవుతాయని రైతులు ఆందోళన చెందుతుండగా.. మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని నగరజీవి సంబరపడుతున్నాడు.












Click it and Unblock the Notifications