27 నుంచి ఉపాధి భరోసా యాత్ర, సీఎం కేసీఆర్‌పై ఇందిరా శోభన్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా విధుల్లో ఉన్న ఉద్యోగులను తొలగించే హక్కు సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని ఇందిరాశోభన్ ప్రశ్నించారు. షర్మిల పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి గన్ పార్క్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 27 నుంచి ఉపాధి భరోసా యాత్రను చేపట్టనున్నట్టు ఆమె తెలిపారు. ఇల్లంతకుంట ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేయడం సిగ్గుచేటని ఇందిరా శోభన్ అన్నారు. రాష్టం వచ్చాక ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఒకవైపు నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రభుత్వ భూములు అమ్మి ఎన్నికలకు పోవడంపై సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 54 వేల మంది ఉద్యోగులను తొలగించారని గుర్తుచేశారు.

పని చేసిన వారికి జీతాలు కూడా ఇవ్వలేదని ఇందిరా శోభన్ విమర్శించారు. రాష్ట్రంలో శ్రమ దోపిడీ జరుగుతోందని.. ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించారని ఇందిరాశోభన్ ఆరోపించారు. ప్రైవేటు టీచర్లకు రూ. 2వేలు, బియ్యం అందడం లేదని, గెస్ట్ లెక్చరర్లను పనిలోకి తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబంలో మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు.
కేసీఆర్ కూతురు కవితకు ఉద్యోగం లేదని వెంటనే ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని ఎద్దేవా చేశారు. సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ పోరాటపటిమను చూపిస్తామని ఆన్నారు. పార్టీలు, పదవులు ముఖ్యం కాదని, ప్రజా సమస్యలపై పోరాడటమే తన ధ్యేయమని అన్నారు. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇందిరా శోభన్ స్పష్టం చేశారు.

ఇందిరా శోభన్ ఇటీవల వైఎస్ఆర్ టీపీ పార్టీ వీడిన సంగతి తెలిసిందే. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత.. రాజకీయ భవిష్యత్ గురించి ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ ఆమె అలాంటి ప్రకటన ఏం చేయలే కానీ.. ప్రభుత్వ విధానాలపై పోరాడుతానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications