ఘనంగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం: చిరంజీవితోపాటు మెగా, అల్లు హీరోల సందడి!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. వెండితెరపై రీల్ కపుల్ గా కనువిందు చేసిన ఈ జంట త్వరలో రియల్ కపుల్ కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం వేడుక హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు.
అత్యంత సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ లు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు అరవింద్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ తో పాటు మెగా, అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో మెగా హీరోలు, అల్లు హీరోలు సందడి చేశారు.

అందరూ వరుణ్ తేజ్, లావణ్య జంటకు శుభాకాంక్షలు తెలిపారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక కు సంబంధించి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వీటిని చూసినవారంతా కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులు వీరిద్దరి జంటను చూడ ముచ్చటైన జంటగా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో #VarunLav హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగనున్నట్టు సమాచారం. ఇక లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ ల ప్రేమ విషయానికి వస్తే 2017లో విడుదలైన మిస్టర్ సినిమా కోసం కలిసి పనిచేశారు. ఈ సినిమా సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
ఆ తర్వాత సంవత్సరంలో వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లీ అంతరిక్షం సినిమా వచ్చింది. అటుపై వీరి స్నేహం ప్రేమగా మారినట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రేమ జంట ఇప్పుడు అత్యంత ఆత్మీయుల సమక్షంలో ఎంగేజ్మెంట్ చేసుకోగా, ఈ ఏడాది జంటగా మారనున్నారు. ఇప్పటి నుండే సోషల్ మీడియాలో వీరి పెళ్లి హడావిడి కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications