భద్రాచలం వద్ద 43 అడుగులకు గోదావరమ్మ..? మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, ఎస్సారెస్పీ వద్ద
భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతోపాటు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి వరద పోటెత్తుతుంది. ఆదివారం రాత్రికి భద్రాచలం వద్ద గోదారమ్మ 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. ప్రస్తుతం 30 అడుగుల వద్ద నది ప్రవహిస్తున్నదని చెప్పారు.

బీ అలర్ట్..
గోదావరి ప్రవాహం పెరుగుతుంటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ హెచ్చరించారు. ముంపునకు గురయ్యే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. పశువులను మేతకు విడిచిపెట్టకుండా ఎత్తయిన ప్రాంతాలకు తరలించాలన్నారు. అత్యవసర సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని, వాగులు, వంకలు, పంట కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఫోన్ నంబర్ 08744-241950, వాట్సప్ నంబర్ 93929 29743, ఆర్డీవో కార్యాలయం కంట్రోల్ రూమ్ వాట్సప్ నంబర్ 93929 19750, భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ 08743 232444, భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయం వాట్సప్ నంబర్ 63024 85393లో సంప్రదించవచ్చని సూచించారు.

ఎస్సారెస్పీకి కూడా..
ఇటు నిజామాబాద్ జిల్లాలో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగవనుంచి వరద తరలివస్తుంది. శనివారం ఉదయం 25 వేల క్యూసెక్కుల్లో ప్రవహించిన వరద ఇప్పుడు 3,20,000 క్యూసెక్కులకు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలకు తోడుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1078 అడుగుల వద్ద ఉంది. జలాశయం నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 49 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల్లో 14 టీఎంసీల నీళ్లు వచ్చి చేరాయి.












Click it and Unblock the Notifications