జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం: ఓపెన్ నాలాలో కొట్టుకుపోయి యువకుడు మృతి
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని మధుసూదన్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఓపెన్ నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, శనివారం ఓ ఓపెన్ నాలాలో కొట్టుకుపోయి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.
వివరాల్లోకెళితే.. ఓ యువకుడు ఓపెన్ నాలాలో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు... యువకుడిని కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఓ తాడు సహాయంతో అతన్ని బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే తాడు తెగిపోవడం, నాలాలో వరద ఉధృతి పెరగడంతో ఆ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. అలా కొట్టుకుపోయిన యువకుడు.. కిలోమీటర్ దూరంలోని గణేష్‌నగర్‌లో మృతదేహమై కనిపించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, వరదలో చిక్కుకున్న వారిని కాపాడి అతను మృత్యువాత పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలు ఈ నాలా గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ యువకుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications