షర్మిల పార్టీలో చేరికలకు గేట్లేత్తేశారా: డైహార్డ్ ఫ్యాన్స్: కొండా దంపతుల కర్చీఫ్? లైన్‌లో ఎవరు?
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకుని రావడం ఖాయమైంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించబోతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఈ పార్టీని నెలకొల్పబోతోన్నారు. వచ్చేనెల చేవెళ్లలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ ద్వారా అధికారికంగా పార్టీని ప్రారంభించబోతోన్నారు. కనీసం అయిదు లక్షలమందితో ఈ సభను ఏర్పాటు చేయాలని ఆమె భావిస్తున్నారు. జిల్లాలవారీగా ప్రస్తుతం నిర్వహిస్తోన్న ఆత్మీయ సమావేశాల అనంతరం పార్టీ ప్రకటన ఉండబోతోంది.
అచ్చొచ్చిన చేవెళ్ల: వైఎస్ షర్మిల పార్టీ పేరు ప్రకటన అక్కడే: 5 లక్షలమందితో

చేరికలు అప్పుడే..
చేవెళ్లలో నిర్వహించబోయే బహిరంగ సభ సందర్భంగా చేరికలకు అవకాశం కల్పించనున్నారు. పార్టీ ఆవిర్భావ దశలోనే వైఎస్సార్టీపీలో చేరడం వల్ల భవిష్యత్తులో రాజకీయంగా లబ్ది పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు తెలంగాణలో వ్యక్తమౌతోన్నాయి. ప్రారంభం నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉండటం వల్ల మున్ముందు.. కీలక పదవులను అందుకోవచ్చన వాదన వినిపిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ది పొందిన వారు. ఆయన హయాంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి. ప్రస్తుతం సైడ్ లైన్‌లో ఉన్న నేతలందరి చూపు షర్మిల పార్టీపై ఉందని అంటున్నారు.

ఎవరెవరు వైఎస్సార్టీపీ చేరుతారు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న నాయకులు, ఆయన హయాంలో ఓ వెలుగు వెలిగిన యువ నేతలు వైఎస్ఆర్టీపీలో చేరడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా వైఎస్సార్‌ను అభిమానించే నేతలు షర్మిలకు అండగా ఉండే అవకాశాలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలతో ప్రమేయం లేకుండా, తటస్థంగా ఉన్న వారు.. వైఎస్సార్టీపీ వైపు మొగ్గు చూపొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆయా పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకులు షర్మిల పార్టీలో చేరొచ్చని తెలుస్తోంది.

కొండా దంపతులు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానులుగా గుర్తింపు పొందిన మాజీమంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వైఎస్సార్టీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. వైఎస్సార్ కేబినెట్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన కొండా సురేఖ.. ఆయన హఠాన్మరణం అనంతరం. మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం మాజీ లోక్‌సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షర్మిల పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు.

మాజీ ఎంపీలు లైన్‌లు
మాజీ ఎంపీలు జీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలకు వైఎస్సార్టీపీ సరైన వేదికగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు వైఎస్సార్‌కు వీరాభిమానులుగా పేరుంది. ప్రస్తుతం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్సార్టీపీలో చేరుతారనేది అనుమానమే. అయినప్పటికీ- బయటి నుంచి షర్మిల పార్టీకి అండదండలను అందించే అవకాశాలు లేకపోలేదు. అలాగే- టీఆర్ఎస్‌కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, గట్టు రామచంద్రా రావు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారసులు వైఎస్సార్టీపీలో చేరొచ్చని అంటున్నారు.