భారత్-పాక్ మరో కీలక నిర్ణయం ? సీజ్ ఫైర్ తర్వాత మరో అడుగు..!
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ జోరుగా కొనసాగుతున్న సమయంలో అమెరికా జోక్యంతో పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదించడం, ఆ తర్వాత కేంద్రం కూడా అంగీకరించడంతో సరిహద్దులు శాంతించాయి. అయితే సీజ్ ఫైర్ నిర్ణయం వెనుక ఎవరున్నారనేది కాసేపు పక్కనబెడితే నాలుగు రోజుల పాటు చోటు చేసుకున్న ఉద్రిక్తతల తర్వాత సరిహద్దుల్లో తిరిగి సాధారణ పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం వెలువడింది.
కాల్పుల విరమణకు ముందుగా నిర్ణయం తీసుకున్న భారత్-పాక్ మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ ఆ తర్వాత ఓసారి హాట్ లైన్ లో భేటీ అయ్యారు. అయితే మరోసారి వీరు భేటీ కావడంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఇవాళ అంతర్జాతీయ మీడియాలో భారత్-పాక్ కలిసి మరో నిర్ణయం తీసుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. భారత్-పాకిస్తాన్ రెండు దేశాలూ ఇప్పటికే కాల్పుల విరమణ పాటిస్తుండగా.. ఇప్పుడు తమ బలగాలను కూడా సరిహద్దుల నుంచి వెనక్కి పిలిపించాలని ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి.

గతంలో ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ ప్రకటనకు ముందు ఉన్న స్ధానాలకు తిరిగి బలగాలను మోహరించాలని ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదీ ఈ నెలాఖరులోపే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఇరు దేశాలూ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీని ప్రకారం చూస్తే మరో 10 రోజుల్లోనే బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే కేంద్రం వైపు నుంచి కానీ, ఆర్మీ వైపు నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. దీంతో ఈ నిర్ణయం ఏ స్దాయిలో జరిగిందన్న దానిపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications