మాయమాటలు చెప్పి మైనర్ బాలికపై అత్యాచారం .. ఆర్నెల్ల గర్భవతిని చేసి.. ఆపై
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారం చేసి, ఆరు నెలల గర్భవతిని చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బాలికలపై లైంగిక వేధింపుల నుండి రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిర్భయ , దిశ వంటి చట్టాలను తీసుకు వచ్చినా మహిళలు, బాలికలపై వేధింపులు నిత్యకృత్యంగా మారుతున్నాయి.

14 సంవత్సరాల మైనర్ బాలికను మభ్యపెట్టి, లైంగిక దాడి చేసిన వ్యక్తి
బాధితుల కథనం ప్రకారం ఒంగోలు, కొమరోలు మండలానికి చెందిన 14 సంవత్సరాల బాలిక అక్కడ కస్తూరిబా బాలికల పాఠశాలలో చదువుతోంది. అయితే కరోనా నేపథ్యంలో పాఠశాలలు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్న బాలికపై, అదే గ్రామానికి చెందిన కాశి రావు అనే వ్యక్తి మరో మహిళ ద్వారా ఇంటికి తీసుకుని వెళ్లి బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది.
బాలిక ఆరు నెలల గర్భవతి అని తెలియడంతో సదరు నిందితుడు సుభానీ అనే ఆర్ఎంపీ వద్ద గుట్టుచప్పుడు కాకుండా గర్భం తీసేయించారు .

గర్భం రావటంతో అబార్షన్ చేయించిన వ్యక్తి .. బాలికకు అనారోగ్యం
దీంతో బాలిక కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో పలు ఆసుపత్రులలో చూపించారు. ఒక ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ చేసిన విషయాన్ని వైద్యులు గుర్తించి బాలిక తల్లిదండ్రులకు చెప్పారు. బాలిక కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీయడంతో ఆమె తనపై జరిగిన లైంగిక దాడిని, అబార్షన్ చేయించడాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
నిందితుడు తనను చంపేస్తామని బెదిరించారని , దీంతో ఇంట్లో చెప్పాలంటే భయపడ్డానని బాలిక వెల్లడించింది.

మైనర్ బాలికను గర్భవతిని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇక బంధువులు సైతం నిందితుడు తనను బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించి మైనర్ బాలికను గర్భవతిని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి తండ్రి మంగళవారం జిల్లా అదనపు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు స్పందించిన అదనపు ఎస్పీ రవిచంద్ర ఫిర్యాదు పై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్కాపురం డిఎస్పి ని ఆదేశించారు.












Click it and Unblock the Notifications