ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు బంద్: ఆకస్మిక నిర్ణయంతో ఇక్కట్లు
నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే దేశ రాజధాని అట్టుడికిపోతోందీ విషయంలో. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా ఉండటంతో అటు ప్రతిపక్షాలు సైతం కత్తి దూస్తోన్నాయి. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించడానికి విఫలయత్నం చేసింది. ఈ ఘటనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వారిని పోలీసులు విడుదల చేశారు.
ఈ పరిణామాల మధ్య ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ షాకిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పలు ప్రధాన మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ స్టేషన్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగిస్తూ కొన్ని కీలక స్టేషన్లలో ఇంటర్‌ఛేంజ్ సదుపాయాన్ని యథాతథంగా కొనసాగించాలని డీఎంఆర్సీ నిర్ణయించింది. రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి జంక్షన్ స్టేషన్లలో ఒక లైన్ నుండి మరో లైన్‌కు మారేందుకు ప్రయాణికులకు అనుమతి ఉంటుందని వివరించింది. ఆయా మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పూర్తిగా మూసివేశామని, ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాలని సూచించింది.
1. లోక్ కల్యాణ్ మార్గ్,
2. రాజీవ్ చౌక్
3. పటేల్ చౌక్
4. రామకృష్ణ ఆశ్రమం మార్గ్
5. బారాఖంబా రోడ్
6. సుప్రీం కోర్ట్
7. సేవా తీర్థ్
8. జన్ పథ్
9. మండి హౌస్
10. సెంట్రల్ సెక్రెటేరియట్
11. ఐటీఓ
12. ఢిల్లీ గేట్
13. ఇంద్రప్రస్థ
14. ఖాన్ మార్కెట్
15. జోర్ బాగ్
16. శివాజీ స్టేడియం స్టేషన్లు.. మూతపడ్డాయి.
ఆయా స్టేషన్లలోకి ప్రయాణికులు నేరుగా ప్రవేశించడానికి లేదా బయటకు వెళ్లడానికి వీలులేదు. ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్ ఎక్స్ఛేంజ్ మాత్రం అధికారులు అనుమతి ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications