పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
న్యూఢిల్లీ: 2014 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. రాహల్ గాంధీపై మహారాష్ట్రలో పరువు నష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టుకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది థానే న్యాయస్థానం.
తన న్యాయవాది ద్వారా రాహుల్ ఈ మేరకు దరఖాస్తును దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన థానే జిల్లాలోని భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్.. రాహుల్ గాంధీ శాశ్వత మినహాయింపునకు అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని వెల్లడించారు.

మహాత్మ గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్సే కారణమంటూ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ మాటలు ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయంటూ 2014లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేశ్ కుంటే.. భివండీ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ క్రమంలో 2018 జూన్‌లో రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యారు. ఆ సమమంలో తాను ఢిల్లీలో ఉంటానని.. కాంగ్రెస్ కార్యక్రమాలతో పాటు తోడు ఎంపీగా వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంటుందని తనకు కోర్టుకు హాజరయ్యేందుకు మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ కోర్టును అభ్యర్థించారు.
తనకు బదులుగా తన న్యాయవాదిని అనుమతించాలని కోరారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలోనే కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువునష్టం దావాలో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ జూన్ 3కు వాయిదా వేశారు.
మహారాష్ట్రలో పరువు నష్టం కేసులో తర్వాతి ఉత్తర్వులు ఇచ్చే వరకు రాహుల్ గాంధీకి కోర్టులో హాజరు నుంచి మినహాయింపు ఉంటుందని భివండీ మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది. అయితే విచారణ తేదీల్లో రాహుల్ న్యాయవాది మాత్రం ఖచ్చితంగా ... సరైన సమయానికి హాజరు కావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని షరతు విధించింది.












Click it and Unblock the Notifications