పాకిస్తాన్ బోర్డర్‌లో మోదీ: స్ట్రాంగ్ వార్నింగ్
Kargil Vijay Diwas: కార్గిల్ విజయం సాధించి 25 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా లఢక్ ద్రాస్ సెక్టార్‌లో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అమరవీరులకు నివాళి అర్పించారు. అమరవీరుల స్తూపం కొన్ని నిమిషాల పాటు మౌనం పాటించారు. జవాన్ల బలిదానాన్ని స్మరించుకున్నారు.
సైనిక వందనాన్ని స్వీకరించారు. అనంతరం- కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు మోదీ. భారత్ ఎలా విజయం సాధించిందో వివరిస్తూ ఆర్మీ అధికారులు చిత్రీకరించిన వీడియోను తిలకించారు. నాటి విజయోత్సవాలను గుర్తు చేసుకున్నారు.

కార్గిల్ విజయ్ దివస్- మన దేశం కోసం చేసిన సైనికులు చేసిన ప్రాణ త్యాగాలకు చిరస్మరణీయంగా నిలుపుతుందని మోదీ అన్నారు. ఎన్ని తరాలు మారినా.. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన వారి పేర్లను ఎవరూ చెరిపివేయలేరని చెప్పారు. కార్గిల్ యుద్ధ సమయంలో మన సైనికుల మధ్య సాధారణ పౌరుడిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.
కార్గిల్‌లో ఘోర పరాజయాన్ని చవి చూసిన పాకిస్తాన్ ఇప్పటికీ గుణపాఠాలను నేర్చుకోలేదని మోదీ అన్నారు. భారత్‌పై పరోక్షంగా యుద్ధం సాగిస్తోందని చెప్పారు. భారత్‌లో అలజడి సృష్టించడానికి గతంలో అన్ని రకాలుగా ప్రయత్నించిన విఫలమైందని మోదీ గుర్తు చేశారు. అయినప్పటికీ బుద్ధి మారట్లేదని ఎద్దేవా చేశారు.
పాకిస్తాన్ నియంత్రణ రేఖ వద్ద నుంచి తాను ఆ దేశానికి హెచ్చరిస్తోన్నానని, భారత్‌లో అశాంతియుత వాతావరణాన్ని లేవదీయడానికి వాళ్లు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించబోవని మోదీ తేల్చి చెప్పారు. అలాంటి ప్రయత్నాలకు పాల్పడితే మన సైనికులు అణిచివేస్తారని, శతృవులకు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.

ఆగస్టు 5వ తేదీ నాటికి ఆర్టికల్ 370ని రద్దు చేసి అయిదు సంవత్సరాలు పూర్తి అవుతుందని మోదీ గుర్తు చేశారు. లఢక్, జమ్మూ కాశ్మీర్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని, దశాబ్దాల తరువాత కాశ్మీర్‌లో సినిమా హాల్ ప్రారంభం కావడమే దీనికి నిదర్శనమని అన్నారు. మూడున్నర దశాబ్దాల తరువాత శ్రీనగర్‌లో తొలిసారిగా తాజియా ఊరేగింపు జరిగిందని అన్నారు.
ప్రతిపక్షాల సంకీర్ణ కూటమి ఇండియాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అగ్నిపథ్ పథకంపై యువతను తప్పుదోవ పట్టిస్తోన్నారంటూ మండిపడ్డారు. ఏనాడూ సైనికుల సంక్షేమాన్ని పట్టించుకోని కొంతమంది నాయకులు దుష్ప్రచారం సాగిస్తోన్నారంటూ ఆరోపించారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకం అంతా బూటకం అని, అది అమలు కావడం అసాధ్యం అంటూ విమర్శించిన వాళ్లకు తన ప్రభుత్వం.. చేతలతో సమాధానం ఇచ్చిందని మోదీ అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేశామని అన్నారు. మాజీ సైనికుల కోసం 1.25 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని చెప్పారు.












Click it and Unblock the Notifications