బీజేపీకి ముస్లీంల నుండి ఎన్నడూ లేని ఆదరణ, 30 లక్షలమంది చేరారు
లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ముస్లీంలు భారతీయ జనతా పార్టీలో చేరారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రషీద్ అన్సారీ లక్నోలో మాట్లాడుతూ... మోడీ పిలుపు మేరకు 30 లక్షల మంది ముస్లీంలు బీజేపీలో చేరారని చెప్పారు.
ప్రతిపక్షాల దాడిని కాదని, తన ప్రభుత్వ కార్యక్రమాలను చూసి తనను అంచనా వేయాలని మోడీ చెప్పారని, దానికి ముస్లీం ప్రజానీకం కూడా స్పందించిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఆదరణ వచ్చిందన్నారు. ఇటీవల మిస్డ్ కాల్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని బీజేపీ సూచించిన విషయం తెలిసిందే.

దీనిపై రషీద్ మాట్లాడుతూ... 30 లక్షల మంది ముస్లీంలు తమ పార్టీలో చేరారన్నారు. తాజా లెక్కల ప్రకారం గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో తమ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.
మిస్డ్ కాల్ ద్వారా సభ్యులుగా చేరే పథకంలో భాగంగా 10 కోట్ల 50 లక్షల సభ్యత్వం నమోదయినట్లు పార్టీ అధ్యక్షులు అమిత్ షా తెలిపారు. దీంతో ప్రపంచంలో అత్యధికంగా సభ్యత్వం ఉన్న పార్టీగా బీజేపీ నిలిచింది. మరో 90 రోజుల పాటు మహా సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్నామని గత నెలలో ప్రకటించారు.












Click it and Unblock the Notifications