
మహారాష్ట్రలో పాసింజర్- గూడ్స్ రైళ్ల ఢీ- 50 మందికి పైగా గాయాలు
మహారాష్ట్రంలో ఇవాళ రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 50 మందికి పైగా గాయాలపాలయ్యారు. గోండియాలో ఓ పాసింజర్ రైలు, మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఘటనా స్ధలికి చేరుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్ ఘడ్ లోని బిలాస్ పూర్ నుంచి రాజస్తాన్ లోని జోధ్ పూర్ కు వెళ్తున్న పాసింజర్ రైలు గోండియా వద్ద గూడ్స్ రైలును ఢీకొట్టింది. సిగ్నల్ సమస్యల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పాసింజర్ రైలు డ్రైవర్ ముందు గూడ్స్ రైలును గమనించి అత్యవసర బ్రేకులు వేసినా ఫలితం లేకపోయింది. దీంతో పాసింజర్ రైల్లో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో రైల్వే అధికారులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో మహారాష్ట్రలోని గోండియాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం కారణంగా పాసింజర్ రైల్లోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో ఉన్న వారే ఎక్కువగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని రైల్వే అధికారులు నిర్ధారించారు. గాయపడ్డ వారిని సమీప రైల్వే ఆస్పత్రితో పాటు పలు ప్రైవేటు ఆస్పత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన పాసింజర్ రైలు బోగీల్ని తిరిగి పట్టాలపైకి ఎక్కించి తెల్లవారుజామున ఘటనా స్ధలి నుంచి పంపేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.