రెండోసారి సీఎంగా యోగీ ప్రమాణం-డిప్యూటీలుగా కేపీమౌర్య, బ్రజేష్ పాథక్ కూడా-50కి పైగా మంత్రులు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయదుందుభి మోగించిన యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు కాక మరో 50 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వీరిలో పలువురు సీనియర్లు, గతంలో యోగీ కేబినెట్ లో పనిచేసిన వారితో పాటు కొత్త ముఖాలు కూడా ఉన్నాయి. ప్రధాని మోడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, పలువురు బీజేపీ సీఎంలు కూడా తరలివచ్చారు.
యోగీ ఆదిత్యనాథ్ కేబినెట్లో ఈసారి కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు. గతంలో డిప్యూటీగా పనిచేసిన కేశవ్ ప్రసాద్ మౌర్యకు మరోసారి అదే పదవి దక్కింది. అలాగే మరో డిప్యూటీ సీఎంగా బ్రజేష్ పాఠక్ ను ఎంపిక చేశారు. వీరితో పాటు పలువురు సీనియర్లకు సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కల ఆధారంగా యోగీ కేబినెట్లో చోటు దక్కింది. వీరిలో ప్రధాని మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఎమ్యెల్యేలుగా గెలిచిన దయాశంకర్ మిశ్రా దయాళు, రవీంద్ర జైశ్వాల్, అనిల్ రాజ్ భర్ ఉన్నారు.

యోగీ కేబినెట్ లో మంత్రి పదవులు చేపడుతున్న వారిలో సురేష్ ఖన్నా, సతీష్ మహానా, సీహెచ్ లక్ష్మీనారాయణ్, జితిన్ ప్రసాద, మహేంద్ర సింగ్, సందీప్ సింగ్, భూపీందర్ సింగ్, బేబీ రాణి మౌర్య, ఆశిష్ పటేల్, సంజయ్ నిషాద్, నంది, ఏకే శర్మ, సూర్య ప్రతాప్ సాహీ, బల్ దేవ్ ఔలఖ్ ఉన్నారు. వీరందరినీ యోగీతో పాటు బీజేపీ అధిష్టానం కూడా ఆమోదముద్ర వేయడంతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. బీజేపీతో పాటు మిత్రపక్షాలైన నిషాద్ పార్టీ, అప్నాదళ్ నుంచి కూడా మంత్రుల్ని తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications