పెను విషాదం: పేలిపోయిన బాణాసంచా ఫ్యాక్టరీ: 6 మంది దుర్మరణం
Explosion in a Firecracker Factory: తమిళనాడులో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
సమాచారం అందిన వెంటనే కలెక్టర్ పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్ర ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

విరుధ్ నగర్ జిల్లాలో ఈ దుర్ఘటన సంభవించింది. జిల్లాలోని సత్తూరు అప్పనాయకన్‌పట్టి గ్రామంలో గల సాయినాథ్ ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్‌లో ఈ మధ్యాహ్నం ఈ పేలుడు జరిగింది. బాణాసంచా తయారీలో కార్మికులు నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం చేస్తూ పేలిపోయిందా ఫ్యాక్టరీ. దీని తీవ్రత సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.
పేలుడు సంభవించిన సమయంలో సాయినాథ్ ఫైర్ వర్క్స్ ఇండస్ట్రీస్‌లో సుమారు 20 మంది వరకు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరుమంది సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ గది మొత్తం కుప్పకూలింది. నామమాత్రంగా కూడా మిగల్లేదు.
మృతులను మీనాక్షి సుందరం, శివకుమార్, కామరాజ్, వేల్‌మురుగన్, కన్నన్, నాగరాజ్‌గా గుర్తించారు. కుప్పకూలిన ఫ్యాక్టరీ భవన శిథిలాల కింది నుంచి మృతదేహాలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పేలుడు సంభవించిన మంటలు చెలరేగాయి.
అక్కడే నిల్వ ఉంచిన బాణసంచాకు అంటుకోవడంతో ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే విరుద్ధ్‌నగర్ జిల్లా కలెక్టర్ వీపీ జయశీలన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు. సాయినాథ్ ఫైర్ వర్క్స్ యజమాని బాలాజీ, శశిబాలన్, మేనేజర్లు దాస్, ప్రకాష్‌పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications