60ఏళ్ల వయసులో రెండో పెళ్లి ప్రకటన: కిడ్నాప్ చేసి ఊరంతా తిప్పారు
చెన్నై: 60ఏళ్ల వయసు పెళ్లి చేసుకుందామని పెళ్లి ప్రకటన ఇచ్చిన ఓ రిటైర్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన చెన్నైలోని తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు చెన్నైకి చెందిన రిటైర్ ఉద్యోగి రామమూర్తి.
తన భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవనం సాగిస్తున్న రామమూర్తికి రెండో వయసులో పెళ్లి చేసుకోవాలని ఆలోచన రావడంతో వధువు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అనుకున్నట్లుగానే ఆయనకు స్పందన బాగానే వచ్చింది.
వైష్ణవి అనే 35 ఏళ్ల మహిళ ఫోన్ చేసి, చెన్నై నగరంలోని కోయంబేడు బస్టాండ్‌కు రమ్మని, మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్పింది. వధువుని చూడాలని ఆతృతగా వెళ్లిన రామమూర్తితో వైష్ణవి మాట్లాడుతుండగా ఇంతలో నలుగురు యువకులు హఠాత్తుగా రామమూర్తిపై దాడి చేశారు.

దాడి అనంతరం వైష్ణవితో పాటు, రామమూర్తిని కారులో ఎత్తిపడేశారు. రెండు రోజుల పాటు కారులోనే నగరం అంతా తిప్పారు. చివరకి ఒక బ్యాంకు దగ్గరికి తీసుకువెళ్లి రామమూర్తి ఖాతాలో ఉన్న రూ. 35 లక్షలు డ్రా చేయాలని డిమాండ్ చేశారు.
దీంతో అసలు విషయం తెలుసుకున్న రామమూర్తి తాను కిడ్నాప్‌కు గురైనట్లు తెలుసుకొని బ్యాంక్ అధికారులకు తెలియజేశాడు. ఈ విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు తాంబరం పోలీసులకు తెలియజేశారు. దీంతో హుటాహుటిన పోలీసులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే దీన్ని గమనించిన వైష్ణవితో పాటు, నలుగురు యువకలు అక్కడి నుంచి ఉడాయించారు.
కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే వైష్ణవితో పాటు ఆ నలుగురు యువకులు రామమూర్తిని కిడ్నాప్ చేసినట్లు తాంబరం పోలీసు ఇన్‌స్పెక్టర్ ఆల్బిన్ రాజ్ వెల్లడించారు. పేపర్ ప్రకటన చూసిన తర్వాతే ఈ పథకానికి వ్యూహం రచించి ఉంటారని అన్నారు.












Click it and Unblock the Notifications