భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలా..:, 28 రోజులుగా 12 జిల్లాల్లో, 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 1409 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం వెల్లడించారు.
28 రోజులుగా 12.. 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..
తాజా 1409 కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 21,393కు చేరిందని అగర్వాల్ తెలిపారు. దేశ వ్యాప్తంగా గడిచిన 28 రోజులుగా 12 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. గత 14 రోజులుగా 78 జిల్లాల్లో పాజిటివ్ కేసు వెలుగు చూడలేదన్నారు. ఇప్పటి వరకు దేశంలో 4257 మంది కోలుకున్నారని తెలిపారు. గత 24గంటల్లోనే 388 మంది కోలుకున్నారని చెప్పారు. మొత్తం కేసుల్లో ఇది 19.89 శాతం అని వివరించారు. 681 మరణాలు సంభవించాయని తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా..
పర్యావరణ శాఖ సెక్రటరీ, ఎంపవర్డ్ గ్రూప్ 2 ఛైర్మన్ సీకే మిశ్రా మాట్లాడుతూ.. లాక్ డౌన్ సమయంలో వైరస్ వ్యాప్తిని గణనీయంగా నియంత్రించగలిగామని తెలిపారు. మార్చి 23 నాటికి దేశంలో 14,915 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేయగా.. ఏప్రిల్ 22 నాటికి ఆ సంఖ్య 5 లక్షలు దాటిందని చెప్పారు. అంటే 30 రోజుల్లోనే 33 రేట్లు అధికంగా పరీక్షలు చేశామని వివరించారు. అయితే, పరీక్షల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఆ ప్రాంతాల్లో సడలింపులు..
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ మాట్లాడుతూ.. లాక్ డౌన్ సడలింపులకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నాన్ హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్నింటికి మినహాయింపు ఇవ్వగా.. ఆ జాబితాలోకి మరికొన్నింటిని చేర్చినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ దుకాణాలు, స్టేషనరీ షాపులకు మినహాయింపులు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేగాక, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ రీఛార్జీ దుకాణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తాయన్నారు. రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ యూనిట్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు శ్రీవాస్తవ తెలిపారు. అయితే, హాట్ స్పాట్ కేంద్రాలకు ఈ మినహాయింపులు వర్తించబోవన్నారు.
Recommended Video

కరోనాతో 6 నెలల చిన్నారి మృతి
ఛండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యూయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీఐఎంఈఆర్) చేరిన ఫఘ్వారకు చెందిన 6 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గుండె ఆపరేషన్ కోసం వచ్చిన చిన్నారికి వైద్య చికిత్స అందించారు. అయితే, ఆమె ప్రాణాలు కోల్పోయింది. పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.












Click it and Unblock the Notifications